రామ మందిరం వస్తుంది... రామ రాజ్యం రావాలంటే..!
ఎన్నో
దశాబ్దాలుగా హిందువులు వేచి చూస్తున్న అయోధ్యలో రామ మందిరం నేడు సాకారం కాబోతుంది.
నిజంగా ఇది ఒక పండుగ రోజే అని చెప్పుకోవాలి. రామ మందిరానికి ఇంత వైభవం ఎందుకు అంటే
ఆ మందిరంలో ఉండేది శ్రీ రాముల వారు కాబట్టి.
రామాయణం ప్రారంభంలో నారద మునిని
వాల్మికి మహర్షి అడిగిన ప్రశ్న - గుణవంతుడు, వీరుడు, ధర్మం తెలుసుకున్న వాడు,
కృతజ్ఞతా భావం కలవాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు, దృడ నిశ్చయం కలవాడు, ప్రవర్తన
వేదాల ఆధారంగా చేసుకున్న వాడు, సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు, విద్వాంసుడు,
సామర్ధ్యం కలవాడు, చూస్తూనే ఉండాలనిపించే రూపం కలవాడు, ఆత్మవంతుడు, కోపాన్ని
గెలిచినా వాడు, ప్రతిభవంతుడు, అసూయను గెలిచినవాడు, కోపాన్ని తెచ్చి పెట్టుకుని
దేవతలను భయపెట్టేవాడు ఇలాంటి 16 గుణాలు ఉన్న మానవుడు ఎవరైనా ఉన్నాడా? అని.
దానికి సమాధానమే పూర్తి రామాయణం.
రామాయణం అంటే “రాముడు నడిచిన మార్గం”. తండ్రి
మాటను జవదాటని కుమారుడిగా, సోదరులను అభిమానించే అన్నగా, భార్య ప్రేమ కోసం పరతపించిన భర్తగానూ, ప్రజా వాక్కు పరిపాలకుడిగానూ
అప్పటికీ, ఇప్పటికీ శ్రీరాముడు ఆదర్శమే. సర్వేశ్వరునితో,
సాటి మనుషులతో ఎలా మసలుకోవాలో తన జీవితంలో ఆచరించి చూపిన ఆదర్శ పురుషుడు
శ్రీరాముడు. ఆయన తన జీవితంలో అనేక పరీక్షలను తట్టుకొని నిలబడడం జరిగింది.
శ్రీరాముడు తన సహోదరులకు తినిపించకుండ తాను
ఏ రోజు భోజనం చేయలేదంటే తన సహోదరుల పట్ల తనకున్న ప్రేమ, మమకారాలు
వెలకట్టలేనివి. సవితి తమ్మునికి రాజ్యం ఇచ్చేయడం ఆయన త్యాగ గుణానికి ప్రబల నిదర్శనం.
ఇలాంటి అన్నగా మనం మన జీవితాన్ని మలచుకోవాలి.
రాజభోగాలు కాదని సవతి
తల్లి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడం జరిగింది. ఆ సవితి తల్లిపై
ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో తెలియజేసే సందర్భాలు రామాయణంలో కోకొల్లలు. ఇంకా ఆయన “ఓ
లక్ష్మణా! తల్లి కైకేయిని బాధ పడవద్దని చెప్పు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. భరతునికే
పట్టాభిషేకం జరుగుతుందని తల్లికి నచ్చచెప్పు. నా తల్లి కైకేయి క్షణమైనా బాధ పడటాన్ని
నేను భరించలేను.” అని అనడం జరిగింది. తల్లి పట్ల ఇటువంటి
ప్రేమాభిమానాలు కలిగిన తనయులుగా మనం మారవలసిన అవసరం ఉంది.
తల్లి కైకేయితో
తన తండ్రి గూర్చి శ్రీరామ చంద్రుడు చెప్తున్న మాటలు గమనించండి. “నా తండ్రి ఆదేశిస్తే అగ్నిలో నైనా దూకుతా. భయంకరమైన
విషం త్రాగమన్నా త్రాగుతా. అగాధమైన సముద్రంలో అయిన దూకుతా”. తండ్రి ఆజ్ఞను పాటించటం
కంటే మానవునికి శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదని శ్రీరామ చంద్రుడు సెలవిస్తున్నాడు. మనం
కూడా పితృ వాక్కు పరిపాలకులుగా నడవ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీరామ చంద్రులవారు అనుక్షణం ఆ సర్వేశ్వరుణ్నే వేడుకునేవారు. ఎన్ని కష్టాలొచ్చిన
మరెన్ని ఇబ్బందులోచ్చినా కృంగిపోలేదు. దైవం మీద ఆయనకు ఉన్న నమ్మకం ఆయన్ను మహోన్నత వ్యక్తిగా
తీర్చిదిద్దాయి. తనకు ఎదురైనా ప్రతి కష్టంలోను ఆయన సర్వేశ్వరుడిని ప్రార్దించారు.
భారతదేశంలోని రామేశ్వరం, శ్రీ రాముల వారు సర్వేస్వరుడిని ప్రార్దించిన
ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. అలా ప్రార్దించడానికి కారణం ఏమిటంటే బాల్యంలోనే ఆయన
గురువు అయినటువంటి విశ్వామిత్రుల వారు ఆయనకు దైవభక్తి నేర్పించడమే. ఉదాహరణకు
రామాయణంలోని బాలకాండంలో సుప్రసిద్దమైన ‘సుప్రభాతం’ అందరికి తెలిసిందే.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవ మన్హికం
కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా రామా! సూర్యోదయానికి వేళ
అవుతుంది లే. నరులలో పులి వంటివాడా లేచి ఆ దైవానికి ఆరాధించటం నీ కర్తవ్యం... అని విశ్వామిత్రుల
వారు శ్రీ రాముల వారిని నిద్ర లేపుతున్నారు. చివరికి ఆయన రావణ సంహార ఘట్టంలో కూడా
బ్రహ్మాస్త్రం ప్రయోగించే సమయంలో కూడా ఆ సర్వేస్వరుడిని తలుచుకున్నారు.
కాబట్టి
నేటి సమాజంలో నైతికత రావాలంటే ఆ మందిరంలోని శ్రీ రాముల వారిని చూసి కళ్ళు మూసుకొని
దండం పెట్టకుండా, కళ్ళు తెరిచి ఆయన ఏ విధంగానైతే సర్వేశ్వరుని పట్ల భక్తి కలిగి శాస్త్రానుసారంగా
జీవితం గడిపారో మనం కూడా అదే విధమైన జీవితాన్ని గడపాలి. ఇంకా మన చిరకాల ఆకాంక్ష అయిన
రామరాజ్యం రావాలంటే కేవలం అయోధ్యలో శ్రీరాముని శిలా నిర్మాణం (Statue
Building) జరిగితే సరిపోదు మన అంతరాత్మలో శ్రీరాముని వంటి శీల నిర్మాణం
(Character Building) కూడా జరగవలసి ఉంది.
* జై
శ్రీరామ్ * జై హింద్ *
No comments:
Post a Comment