గీతాశాస్త్రం వెలుగులో సర్వేశ్వరుడు - మనఃశ్శాంతి..!?

 

గీతాశాస్త్రం వెలుగులో


సర్వేశ్వరుడు - మనఃశ్శాంతి..!?


(ఈశ్వరుడు అనగా అధిపతి;

సర్వేశ్వరుడు అనగా సర్వానికి అధిపతి, సర్వసృష్టికర్త)




విషయ సూచిక


ఒక భక్తునికి సర్వేశ్వరుడి నిర్దిష్ట గుర్తింపు అవసరం లేదా?

సర్వేశ్వరుడు అస్తిత్వ అవగాహన వల్ల మనఃశాంతిని సాధించవచ్చా?

సృష్టి-సృష్టికర్త రెండు వేర్వేరు అస్తిత్వాలు.

సృష్టి-సృష్టికర్త ఒకే అస్తిత్వం.

సృష్టికర్త, సృష్టి పదార్ధములు మరియు ప్రాణులు అనాది.

గీతాశాస్త్రం వెలుగులో సర్వేశ్వరుడి యొక్క మౌలిక సమాచారం.

పరా ప్రకృతి దైవీప్రకృతి యొక్క భాగమా?

పరాప్రకృతికి కూడా శ్రేష్ఠత్వము ఉన్నది కదా!

మహనీయుల పట్ల మన సంబంధం ఎలా ఉండాలి ?

అశాంతికి మూలకారణం ఏమిటి ?

యజ్ఞములు అనగా ఏమిటి ?

తపస్సులు అనగా నేమి?

సర్వేశ్వరుణ్ణి భోక్తగా గుర్తించకపోతే అశాంతి ఎలా ఏర్పడుతుంది ?

సర్వేశ్వరుణ్ణి భోక్తగా గుర్తిస్తే శాంతి ఎలా లభిస్తుంది ?

సమస్తలోకములకు, లోకేశ్వరులకు అధిపతి అంటే ?

శాంతిని సాధించడం ఎలా ?

సర్వేశ్వరుడి మౌలిక లక్షణాలు ఏమిటి ?

సర్వేశ్వరుడి యొక్క మరికొన్ని లక్షణాలు.

సర్వేశ్వరుని యొక్క మరికొన్ని ప్రత్యేకతలు

గతంలో పేర్కొన్న ప్రశ్నలు - వాటి సమాధానాలు

సృష్టికర్తను గూర్చిన మూడు దృక్పథాలను గీతాశాస్త్రం సమర్థిస్తుందా?

సృష్టి సృష్టి రెండు వేర్వేరు అస్తిత్వాలు.

సృష్టి సృష్టికర్త ఒకే అస్తిత్వం.

సృష్టికర్త, సృష్టి పదార్థములు మరియు ప్రాణులు అనాది.

సర్వేశ్వరుని శాస్త్రీయ దృక్పథం పట్ల నిర్లక్ష్యం,

దాని చేదు పరిణామాలు ఒక మచ్చుతునక

లాభ-నష్టాలకు మూలకర్త ఎవరు?

సారాంశం

మనిషికి లాభ-నష్టాలు ఎందుకు కలుగుతాయి?

సమస్త ప్రాణులకు ఆత్మీయుడు.

అనుకూల మరియు వ్యతిరేక ప్రవృత్తులంటే..?

మానవులలోని ఒక చిన్న అధికారితో మైత్రి

కష్టసాధ్యమైనప్పుడు సర్వేశ్వరునితో సాధ్యమా?

భక్తితో భజించటం ఎలా ?

ఈ విధంగా ఆచరిస్తే శాంతి నిజంగానే లభిస్తుందా ?


******


నేటి 'భౌతిక - ఆధ్యాత్మిక' వర్గాల అశాంతిమయ నేపథ్యానికి గల మూలకారణం - ఒక వైపు ఆధ్యాత్మికవాదులు-
'అసలు భౌతికమన్నది ఏమీలేదు,అదంతా ఒక మిథ్య. ఉన్నదల్లా కేవలం ఆధ్యాత్మికతే ఆధ్యాత్మికత అన్న
ఒక రకం అతివాదానికి పోయారు. మరోవైపు భౌతికవాదులు- 'అసలు ఆధ్యాత్మికత అన్నది ఏమీలేదు.
అదంతా ఒక హుళక్కి మాత్రమే! ఇక ఉన్నదంతా భౌతికమే భౌతికం! అన్న మరొక రకం అతివాదానికి పోయారు.
ఈ రెండు అతివాదాల నడుమ నేటి ప్రపంచం నలిగిపోతుంది. విశ్వ మానవాళి అశాంతికి ఇదే కీలక సమస్య.
ఈ దుస్థితినుండి గట్టెక్కే మార్గం ఏమిటీ? అని ప్రశ్నించుకుంటే ఈ క్రింది రెండు పనులు చేయాలన్నదే
సమాధానం. అవి:
1. మనిషి 'భౌతికతత్వాని'కి తగిన 'భౌతికత'ను అతనికి అందించాలి. దాని మోతాదు ఎక్కువగాని,
తక్కువగాని కాకూడదు.
2. మనిషి 'ఆధ్యాత్మికతత్వాని'కి తగిన 'ఆధ్యాత్మికత'ను అతనికి అందించాలి. దానిని కూడా
ఎక్కువ-తక్కువ కాకుండా తగు మోతాదులోనే సరఫరా చేయాలి.

కారణం ఏమిటంటే ఈ సృష్టిలో మూడు రకాల జీవరాశులున్నాయి. వాటిలో మొదటి రకం జీవులు 'దేవతలు'
(ANGLES) అవి కేవలం 'ఆధ్యాత్మికతత్వం' కలవి. కనుక అవి 'అనుకూల ప్రవృత్తి'ని మాత్రమే కలిగి ఉంటాయి.
ముఖ్యంగా అవి 'నిస్స్వార్థ'ప్రాణులు. రెండవ రకం జీవులు 'జంతుజాలం' (ANIMALS) అవి కేవలం
'ఆటవికతత్వం'తోనే ఉంటాయి. కనుక అవి 'ప్రతికూల ప్రవృత్తి'ని మాత్రమే కలిగి ఉంటాయి.
అంటే అవి ముఖ్యంగా 'స్వార్థం' గల ప్రాణులు. ఇక, మూడవ రకం ప్రాణులు 'మానవులు'
(HUMAN BEINGS) వారు 'ఆధ్యాత్మికతత్వం' మరియు 'ఆటవికత లేక భౌతికతత్వము'లను మిశ్రమంగా
కలిగి ఉంటారు. అంటే దేవతలకు భౌతికతతో పనిలేదు. అలాగే జంతుజాలానికి ఆధ్యాత్మికతతో నిమిత్తం
లేదు. కాని ఉభయతత్వాల సమ్మిళిత జీవి అయిన ఈ మనిషికి మటుకు రెండు తత్వాలు సమపాళ్లలో
లభిస్తూ ఉండాలి. ఆ రెండిటిలో ఏది లోపించినా మనిషి జీవన నౌక గతి తప్పుతుంది. వాటిలో
సమతౌల్యం పాటించకపోవటమే నేటి మానవాళి అథోగతికి ప్రబల కారణం.

బి.పి, షుగర్ వంటివి మనిషి 'శారీరక ధర్మాలు' అవి సమపాళ్లలో ఉండి, సమతూకంలో ఉన్నప్పుడే మనిషి
శారీరక ఆరోగ్యం సజావుగా ఉంటుంది. సరిగ్గా అదే ప్రకారం- ఈ 'భౌతిక-ఆధ్యాతిక'తలూ 'మనిషి జీవన
ధర్మాలు'గా ఉన్నాయి. కనుక అవి అతనికి సమపాళ్లలో అందుతూ, సమతూకంలో ఉండాలి. అప్పుడు
మాత్రమే మనిషి జీవన నౌక సుడిగుండాలలో పడక, తుఫానులలో చిక్కక సజావుగా, సాఫీగా సాగి దరికి
చేరగలుగుతుంది.
విషయం ఇక్కడ వరకూ బాగానే ఉంది. అయితే ఈ 'భౌతిక ఆధ్యాత్మికతల మోతాడు' సమాంతర శాతంలో
ఉన్నదో, లేదో నిర్ధారించి చూపే ప్రమాణం (MANUAL) ఏమిటన్నదే అసలు చిక్కు! మనిషి స్వయంగా
నిర్మించే ప్రతి వస్తువుకూ దాని సక్రమ వినియోగ విధానాన్ని సూచిస్తూ ఒక ప్రమాణం (MANUAL) ను దాని
నిర్మాత విడుదల చేస్తాడు. అది అందరికీ తెలిసిందే. దాని ఆవశ్యకతను ఎవరూ తిరస్కరించనూ లేరు.
అదే ప్రకారంగా ఈ మనిషిని నిర్మించిన సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు, అతని జీవితం సజావుగా, సక్రమంగా
సాగటానికి తగిన ప్రమాణం (MANUAL) ను మార్గదర్శి (GUIDE) రూపంలో ఇచ్చి ఉన్నాడు. ఆ మార్గదర్శి
(GUIDE)నే 'గీతాశాస్త్రం' అని అంటారు. ఈ విషయాన్ని ఈ క్రింది శ్లోకములో గమనించగలరు.

గీతా శాస్త్రం
కావున నీవు చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునవుడు నీకు శాస్త్రము ప్రమాణమై యున్నది.
శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దాని ననుసరించి నీవీ ప్రపంచమున కర్మమును చేయదగును. -16:24
ఈ విధంగా గీతాశాస్త్రమే మనిషి 'భౌతిక-ఆధ్యాత్మిక తత్వాలకు 'తగిన మోతాదు'ను. నిర్ధారించి సమతూకంలో
ఉంచటానికి కావలసిన అందించే సాధనం. అని శాసించబడుతుంది. ఈ సాధనాన్ని ఆధారంగా చేసుకొని
వ్యక్తి సంస్కరణకు ప్రయత్నిస్తే ఎలాంటి చిక్కు ఉండదు. అందుకే నేను గీతాశాస్త్రాన్ని ఆలంబనగా చేసుకొని
నేటి మానవాళికి అత్యంత ఆవశ్యకమైన 'మనుషుల మనస్సులకు శాంతిని చేకూర్చే దృక్పథాన్ని లేక
సాధనాన్ని ఆవిష్కరిస్తున్నాను. దాని వైశిష్ట్యాన్ని గమనించాలని నా హృదయపూర్వక మనవి.

భారతదేశము ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతావనికి చెందిన తత్వశాస్త్రం (PHI LOSOPHY) ముందు
ప్రపంచ దేశాల తత్వశాస్త్రాలు చిన్న పిల్లల ఆటలతో సమానం. ఇతర దేశాల తత్వజ్ఞానంతో పోల్చుకుంటే
ఎంతో అద్భుత తాత్విక సంపత్తిని పొంది. ఉన్న మనదేశం, మనో ప్రశాంతతకు సుఖసంతోషాలకు
ఆలవాలం కావాలి. కాని పరిస్థితి తద్భిన్నంగా ఉంది. కారణం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే రెండే రెండు
సమాధానాలు మన ముందుకొస్తున్నాయి. వాటిలో మొదటిది ఆ మహత్తర తత్వజ్ఞానం ఒక చిన్న పండిత
వర్గానికి మాత్రమే పరిమితమైపోవటం. రెండవది సామాన్యుల బుద్ధికి అందని పరిభాషలో ఉండిపోవటం.
ఈ రెండు కారణాలతో తాను స్వయంగా మనో ప్రశాంతతను పొందుతూ, సర్వప్రపంచానికి మనో
ప్రశాంతతకు కావలసిన పాఠాలను బోధించగలిగే గురువు స్థానాన్ని భారతజాతి కోల్పోయింది.
నేటి ప్రపంచానికి కావలసింది భౌతిక సదుపాయాల ఆవిష్కరణలు కాదు. ఎందుకంటే అవి పూర్తిగా
ఆవిష్కృతం అయిపోయాయి. అయితే ఆ సదుపాయాలు సర్వజనులలో సర్వసామాన్యం కావలసి ఉంది.
నేటి ప్రపంచం అత్యంత పరితాపంతో ఎదురుచూసేది- 'మనుష్యుల మనస్సులకు శాంతిని చేకూర్చే సాధనం
ఏమిటా అన్నదే. ఆ సాధనాన్ని ఎవరు ఆవిష్కరిస్తే వారికి బ్రహ్మరథం పట్టడానికి నేటి ప్రపంచం సిద్ధంగా
ఉంది. మనో ప్రశాంతతను కలిగించే సాధనం తత్వజ్ఞానం. ఇక, సరైన తత్వజ్ఞానం భారతజాతి వద్ద ఉండనే
ఉన్నది.

ఒకనాటి ఆధునిక ప్రపంచం అతిపోకడల కాల్పనిక మతాన్ని' చూచి, మతం అంటే ఇలాగే ఉంటుందని
భావించి, 'యథార్థ మతాన్ని సైతం తిరస్కరించింది. దాని స్థానే 'మత రహిత భౌతిక ప్రధాన జీవన వ్యవస్థ'ను
స్థాపించుకుంది. అనతి కాలంలోనే దాని చేదుఫలాలు అనుభవంలోనికి వచ్చాయి. ఆ తరువాత, గత రెండు
దశాబ్దాలుగా ఈ ఆధునిక ప్రపంచం తిరిగి మతం వైపునకు తిరుగు ప్రయాణం ప్రారంభించింది. ఈ తరుణం
భారత దేశానికి ఒక గొప్ప అవకాశం. అయితే భారతీయులు దానికి రెండు పనులు చేయాలి.

1. మూఢ విశ్వాసాలతో, ఆంధానుకరణలతో ఏర్పడిన కాల్పనిక అతి వాద పోకడలున్న మతాన్ని కాక,
మన గీతాశాస్త్రం ప్రతిపాదిస్తున్న సశాస్త్రీయ మతాన్ని ప్రపంచం ముందు పెట్టాలి.
2. మన గీతాశాస్త్ర ప్రతిపాదిత సశాస్త్రీయ స్వచ్ఛమైన మతాన్ని, నేటి ఆధునిక ప్రపంచం అర్థం చేసుకునే
పరిభాషలోనికి మార్చాలి.
పై రెండు పనులు గనక మనం చేసినట్లైతే జపాను ఎలక్ట్రానిక్ ప్రపంచాన్ని శాసిస్తున్నట్లు, అమెరికా ఐ.టి
ప్రపంచాన్ని శాసిస్తున్నట్లు, అగ్రరాజ్యాలు ఆర్ధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నట్లు మనం ప్రపంచాన్ని
ఆధ్యాత్మికంగా శాసించవచ్చు. మన ఈ పుణ్య భారతావనిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మలచవచ్చు.
తమ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చగలిగే సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందన్న సంగతి ప్రపంచ
ప్రజలకు ఆదినుండి తెలుసు. అందుకే నేటి ఆధునిక దేశాలకు చెందిన గొప్పగొప్ప విద్యావంతులు సైతం
మన ఆశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. మన స్వామీజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కారణం ఏమిటంటే-
మనవద్ద వేదోపనిషత్తులు, వాటి సారమైన గీతాశాస్త్రం, బైబిలు మరియు ఖురాన్ వంటి ఉద్గ్రంథాలు ఉన్నాయి.
గతంలో మనం ఎన్నో అవకాశాలను చేజార్చుకున్నాము. ఇప్పుడు మన తలుపు తడుతున్న ఈ భాగ్యాన్ని
మటుకు చేజార్చుకోరాదు. ఇది మనకు చివరి అవకాశం. దీనిని మనం ఎలాగైనా అంది పుచ్చుకోవాలి.
అందుకే- 'నా జాతికి ఉచ్చస్థాయి లభించాలి. ప్రపంచ నలుమూలలలో నా దేశ పతాకం ఆధ్యాత్మికతకు,
మనఃశ్శాంతికి ప్రతీకగా నిలవాలి. అన్న స్వచ్ఛమైన, బలమైన కోరికతో వేదోపనిషత్తుల సారాంశమైన
గీతాశాస్త్రం వెలుగులో 'సృష్టికర్త-మనశ్శాంతి..!?' అనే మకుటంతో మీ చేతులలోని ఈ చిరు పుస్తకాన్ని
రచించాను. మన జాతి ఆధ్యాత్మిక వికాసాన్ని కాక్షించే మీరు కూడా ఈ పుస్తకాన్ని కూలంకషంగా అధ్యయనం
చేయాలని, మానవాళి మనో ప్రశాంతతకు ఏకైక సాధనమైన శాస్త్ర ప్రధాన సనాతన దైవభావాన్ని'
(ANCIENT SCRIPTURAL CONCEPT OF GOD)ని అర్ధం చేసుకొని, ఆచరించాలని మరియు దానిని
ప్రచారం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.

సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని పేరుతో

ఒక భక్తునికి సర్వేశ్వరుని నిర్దిష్ట గుర్తింపు అవసరం లేదా?

మనలోని ప్రతి ఒక్కరు పూజలు, ప్రార్ధనలు, ఉపవాసదీక్షలు, ధ్యానవ్రతాలు మరియు దానధర్మాలు నిత్యం
చేస్తూనే ఉంటారు. 'ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నట్లు? ఎవరి ప్రసన్నత పొందడానికి ఆచరిస్తున్నట్లు?' అని
ఎవరిని ప్రశ్నించినా 'సర్వేశ్వరునికొరకు, ఆయన ప్రసన్నత పొందడానికి' అని అలవోకగా సమాధానం ఇస్తారు.
ఇంతవరకు బాగానేవుంది. 'ఇంతకూ ఆ సర్వేశ్వరుడు ఎవరు?' అని ప్రశ్నిస్తే మనలోని అధికశాతం ప్రజలు
'ఫలానా 'లక్షణాలు' మరియు ఫలానా 'సామర్థ్యాలు కలిగిన అస్తిత్వమే 'మన సర్వేశ్వరుడు' అని నిర్దిష్టంగా
సమాధానం చెప్పలేరు. అంటే సర్వేశ్వరుడు ఎవరో ఆయన 'మౌలిక లక్షణాలేమిటో?' మరియు ఆయన
'మౌలిక ఆదేశాలేమిటో? కనీసం గుర్తించకుండానే ఆయనను ఆరాధిస్తున్నారు మనలోని అధికశాతం
ధార్మికులు, ఈ పోకడ ఎంతటి అజ్ఞానంతో కూడుకున్నదో మరెంతటి విచిత్రమైనదో ఈ క్రింది.
ఉదాహరణల ద్వారా మీరే స్వయంగా ఊహించగలరు.

ఒక వ్యక్తి ప్రయాణమవడానికి కావలసిన సకల వస్తుసామగ్రిని సిద్ధం చేసుకున్నాడు. ఇంకా ప్రయాణం
అయిపోయాడు కూడా. అయితే అతడు కేవలం ఒకే ఒక విషయాన్ని మాత్రం నిర్ధారించుకోలేదు.
అదేమిటంటే, అతడు చేరవలసిన గమ్యం-"గమ్యనిర్ధారణ లేకుండా ప్రయాణం కట్టడం కంటే
అజ్ఞానభూయిష్టమైన చర్య అంటూ ఏదైనా ఉంటుందా?" అని అతనిని ప్రశ్నిస్తే అతడు- "ఒక్క గమ్యనిర్ధారణే
కదా నేను విస్మరించింది. పళ్లు తోముకొనే పేష్టునుండి ప్రయాణం ఖర్చువరకు అన్నీ సంసిద్ధం
చేసుకున్నాను. అయినప్పటికీ నన్ను తప్పుపడుతున్నారేమిటి?" అని వాదిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి
మీరిచ్చే సలహా ఏమిటి?"చూడునాయనా! ప్రయాణ సామగ్రి ఏర్పాట్లలో ఏకాస్త అసంపూర్ణత ఉన్నప్పటికీ నీ
గమ్య నిర్ధారణ అనేది మాత్రం నిర్దిష్టంగా ఉండాలి. అలా కానప్పుడు నీవు ప్రయాణం కొరకు చేసే ప్రతి
సన్నాహం, ప్రతి ఏర్పాటు ఎంతనిరర్థకమో అంతే నిష్ప్రయోజనం అవుతుంది" అన్నదే కదా?
ఈ విధంగా ఇతరుల విషయంలో తీర్పునిచ్చే మనం సృష్టికర్త అయిన దైవం ఎవరో నిర్ధారించకుండానే
అరాధనా ప్రతాదులు చేసుకుంటూ పోతున్నామే! మరి దీని సంగతి ఏమిటి? గమ్యనిర్ధారణ లేనప్పుడు
ప్రయాణం కొరకుచేసే ప్రతి ఏర్పాటు, ప్రతి సన్నాహం నిరర్ధకం మరియు నిష్ప్రయోజనం అవుతున్నప్పుడు,
సృష్టికర్త అస్తిత్వం యొక్క నిర్ధారణ జరుగకుండానే మనం చేసే ప్రతి అర్చనా మరియు ప్రతి ఆరాధనా
నిరర్ధకం నిష్ప్రయోజనం కాదా? కాస్త ఆలోచించండి!
నేడు మన దేవాలయాలు విస్తరించబడుతున్నాయి. కొత్తవికూడా వెలుస్తూ పోతున్నాయి. ఏ
ప్రార్ధనామందిరాన్ని చూచినా ఇనుకవేస్తే రాలని జనంతో కిటకిటలాడుతుంది. ఎటు చూసినా
పూజాప్రతాల కోలాహలం. అన్ని వైపులా ఆధ్యాత్మిక సంరంభం, సర్వత్రా ధార్మిక ప్రభంజనం.
ఇంత జరుగుతున్నా వ్యక్తుల మనస్సులలో శాంతి, వ్యక్తిత్వాలలో నీతి మరియు పరస్పరవ్యవహారాలలో
త్యాగనిరతి లాంటి విలువలు మటుకు అంకురించడం లేదు. ఈ సుగుణాలను ప్రతిఫలింప జేయలేని
ఆధ్యాత్మికతకు, ధార్మికతకు ఇక అర్థం ఏముంటుంది. నేటి మన ఈ సామాజిక నేపథ్యమే ప్రస్తుతం మనం
అవలంబిస్తున్న ఆధ్యాత్మిక కార్యాకలాపాలు నిర్హేతుకమైనవని సాక్ష్యమిస్తున్నాయి. ఈ విధంగా మన
ఆధ్యాత్మిక కార్యకలాపాలు గురిలేని బాణాలుగా, బూడిదలో పోసిన పన్నీరుగా నిష్ఫలమవుతున్నాయి.
దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నిస్తే మన గీతాశాస్త్రం. ఇచ్చే సమాధానాన్ని గమనించండి.

అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవ చ
న తు మామభిజానన్తి తత్వేనా తశ్చ్యవన్తి తే -గీత 9:24

ఏలయనగా, సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువు (యజమానుడు)ను నేనే అయి యున్నాను. అట్టి నన్ను
వారు యథార్థముగ తెలిసికొనుట లేదు. ఇందు వలన జారిపోవుచున్నారు.

సమాజం భ్రష్టు పట్టిపోయినప్పుడు, సమాజంలో అశాంతి అరాచకాలు తాండవి స్తున్నప్పుడు, ప్రజలలో
ఆధ్యాత్మికత అడుగంటిపోయింది. కాబట్టి మన సమాజం ఇలా తగలబడుతోంది అని మన సంస్కర్తలు
చెబుతుండటం మనకు తెలుసు. అయితే ఆధికశాతం ఆధ్యాత్మికులు ఉన్న సమాజం చెడిపోతే! దీనికి
కారణం ఏమని చెప్పాలి? పై శ్లోకం సరిగ్గా ఆ కారణాన్నే చూపిస్తుంది. పై శ్లోకంలోని రెండవ పాదంలో
'నన్ను యథార్థంగా తెలుసుకొనుట లేదు, ఇందుమూలంగా (చెడులలోనికి) జారిపోవుచున్నారు' అని
మానవ సమాజ భ్రష్టత్వానికి కారణంగా సృష్టికర్త స్వయంగా ఒక 'క్లూ'ను ఇస్తున్నాడు. అంటే సృష్టికర్తను
మనం మొత్తానికే తెలుసుకోలేదా? కాదు తెలుసుకున్నాము కాని సృష్టికర్త చెప్పేదాని ప్రకారం ఆయనను
'యథార్థం'గా తెలుసుకోలేదు.

ఇది నిజమే. అందుకే 'జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి' అన్న చందంగా సృష్టికర్తను గురించి ఎవరికి తోచిన
విధంగా వారు వర్ణించుకుంటూ పోతున్నారు. ఆ వర్ణనల ద్వారా పరస్పరం ఏ మాత్రం పొంతనలేని
విశ్వాసాలు కోకొల్లలుగా ఏర్పడి పోయాయి. పర్యవసానంగా సృష్టికర్త అస్తిత్వం యొక్క ఏ యథార్థ అవగాహన
ద్వారా వ్యక్తులలో పరివర్తన-మనశ్శాంతి సాధ్యమో, అటువంటి అవగాహన మటుకు ప్రస్ఫుటం కావటం
లేదు. సృష్టిలోని ప్రతి దానికి తనదంటూ ఒక నిర్దిష్ట గుర్తింపు (SPECIFIC identity) అన్నది ఉంటుంది.
అటువంటప్పుడు హేతువు ప్రకారం ఈ చరాచర సృష్టి అంతటికీ ఏకైక కర్త అయిన వానికి కూడా తనదంటూ
ఒక నిర్దిష్ట గుర్తింపు ఉండాలి కదా!
సర్వేశ్వరుని అస్తిత్వ అవగాహన వల్ల మనఃశాంతిని సాధించవచ్చా?
పై శ్లోకం ప్రకారం సర్వేశ్వరుని యథార్థంగా తెలుసుకుంటే మనుషులు మంచివాళ్లయి పోతారా? అన్న
ప్రశ్న తలెత్తుతుంది. దానికి గీతాశాస్త్రం ఇచ్చే సమాధానం ఏమిటో ఈ క్రింది శ్లోకంలో పరిశీలించండి.

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ స మస్తవ్యస్సమ్యగ్వ్యవసితో హి సః -గీత 9:30

మిక్కిలి దురాచారముగలవాడైనప్పటికిని అనన్యభక్తిగలవాడై ఇతరముగు దేని యందును భక్తినుంచక,
(ఆశ్రయింపక) నన్ను భజించునేని, అతడు సత్పురుషడనియే (శ్రేష్టుడనియే) తలంపబడదగినవాడు.
ఏలయనగా అతడు స్థిరమైన (ఉత్తమ) మనో నిశ్చయముగలవాడు.

ఈ పై శ్లోకం ప్రకారం ఒక వ్యక్తి అత్యంత దుర్మార్గుడు, దుష్టుడు అయినప్పటికీ ఆ ఒక్క సర్వేశ్వరుని
మాత్రమే భజించినట్లయితే ఉత్తముడైపోతాడని స్పష్టం అవుతుంది. అంతకంటే కావలసింది ఏమిటి?
అయితే ఆ ఒక్కడినే భజించటం అన్నది ఎప్పుడు సాధ్యం? ఆయనను యథార్థంగా తెలుసుకుంటేనే కదా!
దీనిని బట్టి సర్వేశ్వరుని తెలుసుకోవటం ద్వారా మనిషికే అపారప్రయోజనం కలుగుతుందని అర్థం
అవుతుంది. దీని వలన సర్వేశ్వరునికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన స్వయంగా
సర్వ సమర్థుడు సర్వప్రదాతానూ. మా ఈ రచన ఆద్యంతమూ సృష్టికర్త అస్తిత్వ అవగాహన మరియు ఆ
అవగాహన ద్వారా శాంతి ఎలా లభ్యమవుతుంది? అన్న ప్రశ్న చుట్టు తిరుగుతుంది. సృష్టికర్త అస్తిత్వ
అవగాహన వలన శాంతిని సాధించటం ఎలా సాధ్యమో ఈ చిరుపుస్తకాన్ని అధ్యయనం చేస్తే మీకే
బోధపడుతుంది.
అయితే సృష్టికర్త యథార్థ అవగాహన ఇదేనని ఎలా చెప్పగలరు? అని ప్రశ్నిస్తే మా సమాధానం-
యథార్థమనేది 'హేతుబద్ధంగానూ' మరియు 'మనస్సును హత్తుకునేది' గానూ ఉంటుంది. ఈ రెండు
లక్షణాలు లేనిది, అది ఎన్నటికీ యథార్ధం కాజాలదు. సృష్టికర్త అస్తిత్వమును గురించి జనసామాన్యంలో
ఎన్నెన్నో పరస్పర విరుద్ధ విశ్వాసాలు
ప్రచారంలో ఉన్నాయి. కాని మన గీతాశాస్త్రమైతే యథార్థాలను నిష్పక్షపాతంగానూ మరియు
హేతుబద్ధంగానూ తెలియజేస్తుంది. కనుక దాని ఆధారంగానే ఒక్కొక్క విషయాన్ని పరిశీలించి
తెలుసుకుందాము. ఈ పరిశీలనకు ముందు నేటి సమాజంలో సృష్టికర్తను గురించి అధిక ప్రాచుర్యంలో
ఉన్న కొన్ని విశ్వాసాలను గురించి ముందుగా ప్రస్తావించుకుందాము. అవి:

1. సృష్టి-సృష్టికర్త రెండు వేర్వేరు అస్తిత్వాలు.
సృష్టికర్త మానవాళి సంస్కరణ కొరకు మనిషిగా అవతరిస్తూ ఉంటాడు. అంటే మనిషిలా జన్మించి,
మనిషిలా పెరిగి మనిషికి ఉన్న సహజ బలహీనతలు కలిగి ఉంటాడు. కాని కొన్ని ఆదర్శాలు ఆచరించి
చివరకు మనిషిలానే తనువును చాలిస్తాడు. ఈవిధంగా అవతరించిన వారందరూ సాక్షాత్తు సర్వేశ్వరులే
అనే ఆలోచన ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

2. సృష్టి సృష్టికర్త ఒకే అస్తిత్వం.
ఇదెలాగంటే విభిన్న సృష్టితాలుగా కనిపిస్తున్న ఈ అనంతవిశ్వం యొక్క మూల పదార్థం సృష్టికర్తే.
అంటే, మట్టి అనే ఒకే మూలపదార్థంతో విభిన్న పాత్రలు ఎలా చేయబడ్డాయో అలాగే సృష్టికర్త స్వయంగా
ఈ అనంతవిశ్వంలో కనిపిస్తున్న రూపాలను సంతరించుకున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే దేవుడు
స్వయంగా మల్లెలుగానూ ఉన్నాడు మరియు మట్టిగాకూడా అభివ్యక్తం అయివున్నాడు. కాబట్టి ప్రతి వస్తువు,
ప్రతి పదార్థమూ సాక్ష్యాత్తు సర్వేశ్వరుడే అనే భావనకూడా సర్వత్రా ప్రబలి ఉంది.

3. సృష్టికర్త సృష్టి పదార్ధములు మరియు ప్రాణులు అనాది.
ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఏవిధంగా సనాతనుడో, ఆదిలేనివాడో అనగా
అనంతకాలం నుండి ఉన్నవాడో అదేవిధంగా సృష్టి పదార్థము మరియు ప్రాణులు అనగా ఆత్మలుకూడా
అనంతకాలం నుండి ఉన్నాయన్నది ఒక వాదన.

సృష్టికర్తను గూర్చిన యథార్థమైన అవగాహన మనకు లేదు అనటానికి పై విభిన్న విశ్వాసాలే ప్రబల
తార్కాణం. ఒకే అస్తిత్వం విషయంలో ఇన్ని విరుద్ధభావాలు యథార్థం అవడం అసంభవం. ఈ గందరగోళ
విశ్వాసాలే నేటి ఆధునిక యువతను ధర్మాన్నుండి. దూరం చేశాయి. ఎందుకంటే యథార్థమనేది
ద్వంద్వంగా ఉండదు. అలా ఉన్నది యథార్ధం కాజాలదు. అసలు యథార్థం ఏమిటో మన గీతాశాస్త్రం
వెలుగులో పరిశీలించి. తెలుసుకుందాము.

గీతాశాస్త్రం వెలుగులో సృష్టికర్త యొక్క మౌలిక సమాచారం. గీతాశాస్త్రం వెలుగులో దేవుని అస్తిత్వం యొక్క
యధార్ధతను అన్వేషించినప్పుడు కొన్ని దృక్పథాలు పరస్పరం విరుద్ధంగా కనిపిస్తాయి. పర్యవసానంగా
ఒక పాఠకుడు సందిగానికి లోనవుతాడు. లేక తనకు తారసపడిన విభిన్న దృక్పథాలలో తనకు నచ్చిన
ఏదో ఒక దృక్పథాన్ని స్థిరపరచుకుంటాడు. ఆ విధంగా జరిగిన కారణంగానే నేడు దేవుని విషయంలో విరుద్ధ
విశ్వాసాలు జన సామాన్యంలో సర్వసామాన్యం అయి పోయాయి. ధార్మికగ్రంథాల అధ్యయనంలో ఎదురైన
ఆయా దృక్పథాలను సమన్వయం చేసుకొని అనలుసారాన్ని రాబట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడే
యథార్థం బయటపడుతుంది. అయితే గీతాశాస్త్రంమటుకు సృష్టికర్తను గూర్చిన స్పష్టమైన దృక్పథాన్నే
ఇస్తుంది. ఈ క్రింది శ్లోకాన్ని కాస్త నిశితంగా పరిశీలించగలరు.

ద్వావిమా పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షరస్పర్వాణి భూతాని కూటz స్ట్రోక్షర ఉచ్యతే -15:16

ఈ జగత్తునందు క్షరుడు(నశ్వరుడు) అక్షరుడు(వినాశరహితుడు) అను పురుషులు రెండు విధములుగా
గలరు. సకల ప్రాణుల శరీరములు | నశ్వరములు జీవాత్మ నాశరహితుడు.

పైశ్లోకంలో ఈ విశ్వవ్యవస్థలోని రెండు విభిన్న ప్రకృతులను గురించి చెప్ప బడుతుంది. వాటిలో మొదటిది
పంచభూతాల సముదాయంతో చేయబడింది. అంటే ఈ విశ్వంలోని సమస్త సృష్టిరాశులు, సకల జీవుల
శరీరాలు వగైరా... ఇదంతా 'అపరా ప్రకృతి' ఈ పదార్థాన్ని మన పంచేద్రియాలతో గ్రహించవచ్చు.

దీనికి అతీతంగా సృష్టికర్త యొక్క మరొక ప్రకృతి ఉంది. అది పంచభూతాత్మకం కాదు. అది ఎంతో
శ్రేష్ఠమైన పదార్థంతో నిర్మించబడింది. దానిని 'పరాప్రకృతి' అని అంటారు. అంటే పంచభూతాత్మక
ప్రకృతికి క్షీణించి, నశించే గుణం ఉన్నట్లు దానికి లేదు. అది ఎల్లప్పుడు యథాతథంగా ఉంటుంది.
ఈ పదార్థంతో నిర్మించబడిన అస్తిత్వాలు ఏమిటంటే ఒకటి మానవుల శరీరంలోని ఆత్మలు మరియు
రెండవది సృష్టి కార్య కలాపాలను నిర్వహించడానికి సృష్టికర్తచే నియమించబడిన అస్తిత్వాలు అనగా
దేవతలు. ఈ అస్తిత్వాలను సాధారణంగా మన పంచేద్రియాలతో గాంచలేము. వాస్తవానికి ఇవికూడా
నశించేవే- అయితే సృష్టికర్త వాటికి నిత్యత్వాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా ఇవన్నీ అక్షరులు అయ్యాయి.
అంటే ఏనాటికీ నాశనం కానివి. దీనిని బట్టి ఇంతవరకూ సామాన్యంగా భావించబడుతున్నట్లు ప్రకృతి
అన్నది ఒక్కటే కాక దీనికి భిన్నమైన ప్రకృతి మరొకటి కూడా ఉందని ఈ వివరణ ద్వారా బోధపడుతుంది.
ఈ రెండు ప్రకృతుల మిశ్రమంతో తయారు చేయబడిన జీవియే మానవుడు, ఈ 'పర-అపర' అస్తిత్వాలను
పురుషులు అని పేర్కొనడం జరిగింది. పురుషుడు' అనగా లింగపరంగా కాదు. పురుషుడు అనగా అస్తిత్వము
లేక ఒక ప్రత్యేక రాశికి లేక ఒక ప్రత్యేక తరగతికి చెందిన సృష్టితాల మూలపదార్ధం అనే అర్థములో ఇక్కడ
చెప్పబడింది.

పరా ప్రకృతి దైవీప్రకృతి యొక్క భాగమా? నేటి అధికశాతం ఆధ్యాత్మికులు ఈ అక్షరమైన అస్తిత్వాన్నే
సర్వేశ్వరుని అస్తిత్వపు విభాగంగా భావిస్తున్నారు. దీనికి మొదటి కారణం పాంచభౌతిక సముదాయమైన
అపరాప్రకృతికంటే, పరాప్రకృతి ఎంతో శ్రేష్టత కలిగి ఉండటం. రెండవది ఈ పరాప్రకృతికి నశింపు
లేకపోవడం. ఇవి రెండూ దైవీ ప్రకృతి గుణాలేకదా! అని భావించి మనిషిలోని ప్రతి ఆత్మనూ సాక్షాత్తు
దైవంగా భావించడం ప్రారంభించారు. (అలాగే ధర్మ సంస్థాపనార్థం ఆయా కాలంలో అవతరించిన
పరమాత్మ అయిన దేవతను కూడా సాక్షాత్తు అక్షర పరబ్రహ్మగా భావించడం జరిగింది. నిజానికి మన
గీతాశాస్త్రాన్ని కాస్త పరిశీలనగా చదివితే ఈ 'క్షర-అక్షర' ఇరువురు పురుషులకంటే సృష్టికర్త అస్తిత్వం పూర్తిగా
భిన్నమైనదని మరియు వాటికంటే ఎంతో శ్రేష్ఠమైనదని స్పష్టంగా బోధపడుతుంది. ఈ క్రింది శ్లోకాన్ని
పరిశీలించండి.

ఉత్తమః పురుషస్వన్యః పరమాత్మేత్యుదాహృతః
లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః -15:17

(క్షర-అక్షరుల) కంటెను ఉత్తముడైన పురుషుడు వేరైనవాడొకడు కలడు. అతడే నాశరహితుడైన
పరమేశ్వరుడు అతడు ముల్లోకములందును ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు.
పైశ్లోకములో గమనార్హమైన మూడు విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది. క్షర మరియు అక్షర
పురుషులిరువురి నుండి సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని 'ఉత్తమః' అనే విశేషణం ద్వారా పూర్తిగా వేరు
చేయబడింది. రెండవది 'అన్యః' అనే పదాన్ని ప్రయోగించి సర్వేశ్వరుని అస్తిత్వాన్ని క్షర, అక్షరుల నుండి
పూర్తిగానేకాక, మౌలికంగా ఉన్న విలక్షణతనూ చూపిస్తున్నాడు. పర మరియు అపర ప్రకృతుల మధ్య ఉన్న
స్పష్టమైన భేదం అందరికీ తెలిసిందే. అదెలాగంటే అపరాప్రకృతి నశించేది. పరాప్రకృతి నశింపులేనిది.
ఈ విషయంలో అందరిది ఏకాభిప్రాయమే. దీనిని అందరూ అంగీకరిస్తారు.
ఇక్కడ దీనికి మించిన మరొక విషయం ఉంది. ఇక దానిని అర్థం చేసుకొని అంగీకరించాలి. అదేమిటంటే
నశింపని పరా ప్రకృతి కంటే 'స్వభావం' మరియు 'యోగ్యత' పరంగా సర్వేశ్వరుని అస్తిత్వం సంపూర్ణంగా
విలక్షణమైనది విశిష్టమైనదిగా ఉన్నది. పరా ప్రకృతి శ్రేష్ఠం అయితే దైవీ ప్రకృతి సర్వశ్రేష్ఠం. ఈ విషయాన్ని
అంగీకరించినప్పుడు మాత్రమే ఒక భక్తునికి తన సృష్టికర్తతో అత్యంత బలీయమైన ప్రత్యేక సంబంధం
ఏర్పడుతుంది. ఈ ప్రత్యేక సంబంధమే భక్తుడి మనస్సును ప్రభావితం చేస్తుంది. ఈ రహస్యాన్ని అర్థం
చేసుకోకపోవడమే నేటి ఆధ్యాత్మికత 'నిస్సారం' మరియు 'నిష్ఫలం' అయిపోవడానికి మూలకారణంగా
నిలిచింది. ఈ దైవీప్రకృతి యొక్క మూడవ ప్రత్యేకతను గమనించగలరు. అదేమిటంటే 'ముల్లోకములు'
అనగా 'పర-అపర ప్రకృతుల సమ్మేళనం'తో ఏర్పడినదే ఈ పూర్తివిశ్వం. ఈ విశ్వంతో ఆయనకుగల
సంబంధాన్నికూడా ఈ శ్లోకం విశ్లేషిస్తుంది. ఈ విశ్వంలో ఆ సృష్టికర్త- ఒకటి ప్రవేశించి, రెండు భరిస్తూ,
మూడు పోషిస్తూ ఉన్నాడు. దీనిని బట్టి అపరా ప్రకృతేకాక పరాప్రకృతి కూడా 'స్వతంత్ర అస్తిత్వం' కాదని,
ఇంకా 'స్వీయ పోషకత్వం' కలిగి లేదని స్పష్టమవుతుంది. అపరా ప్రకృతిలాగే పరాప్రకృతి కూడా
దైవీప్రకృతిపై ఆధారపడి, ఆ దైవీ ప్రకృతిద్వారానే పోషించబడుతుందని అర్థమవుతుంది. ఇంకా ఈ
పరాప్రకృతికి గల 'శ్రేష్ఠత్వం' మరియు 'నాశరహిత' గుణములు కూడా సర్వేశ్వరుని ప్రసాదితములేగాని దాని
స్వీయ గుణములు కావు అనికూడా తెలుస్తుంది. ఈ విశ్లేషణను బట్టి 'పర- అపర' ప్రకృతులు రెండూ
'పరతంత్రులు', 'దైవీప్రకృతి' అనగా సర్వేశ్వరుడు ఒక్కడే 'సర్వస్వతంత్రుడు'' అని తెలుస్తుంది.
ఈ విషయాన్ని క్రింది శ్లోకం మరింత తేటపరుస్తున్న వైనాన్ని గమనించగలరు.

యస్మాత్ర మతీతోకూ మక్షరాదపి చోత్తమః |
అతోస్మి లోకే వేదే చ ప్రధితః పురుషోత్తమః -15:18

ఏలనన నశ్వరమగు(అపరాప్రకృతి) జడవర్గము (క్షేత్రము) కంటెను సర్వదా అతీతుడను, నాశరహితమైన
జీవాత్మ (పరాప్రకృతి) కంటెను ఉత్తముడను, కనుక ఈ జగత్తునందును వేదములయందును
పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. ఇక్కడ గమనార్హమైన విషయాలు మూడు ఉన్నాయి. వాటిలో మొదటిది
పర- అపర ప్రకృతులకంటే తనకుగల 'విలక్షణతను, శ్రేష్ఠతను' పరమాత్ముని నోటిద్వారా సర్వేశ్వరుడు
మరొకసారి తెలియపరుస్తున్నాడు. రెండవది లోకంలో అనగా జనసామాన్యంలో తను పురుషోత్తముని
(పరాపర అస్తిత్వాల కంటే గొప్పవాని)గా వెలుగొందుతున్నానని తెలియపరుస్తున్నాడు. ఇది ఎంతటి
యథార్థమో కాస్త పరిశీలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రజాబాహుళ్యంలోని పండితులు, పామరులు మరియు
నాగరికులు, అనాగరికులు అనే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే "ఈ విశ్వమంతటిలోనూ సర్వశ్రేష్ఠుడు
ఎవడు?". అని ప్రశ్నిస్తే అందరూ ఏకగ్రీవంగా ముక్తకంఠంతో "ఆ ఒక్క సర్వేశ్వరుడు మాత్రమే.
సర్వశ్రేష్టుడు" అని నిర్ద్వంద్వంగా, నిస్సంశయంగా, నిస్సంకోచంగా ప్రకటిస్తారు. దీనికి పరాకాష్ఠ ఏమిటంటే
నాస్తికులైన శాస్త్రవేత్తలు సైతం 'THERE IS SOME POWER' అని సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు.
ఇక మూడవది- వేదములలో ఈ 'పర అపర' ప్రకృతులు దైవీప్రకృతి (సర్వేశ్వరుని అస్తిత్వానికి) దీటైనవిగా
ఉన్నాయి లేక ఆయనలోని విభాగములుగా ఉన్నాయి అని లేక పోవటం అత్యంత గమనార్హం.ఈ విధంగా సర్వేశ్వరుని అస్తిత్వం సమస్త అస్తిత్వాలకు సర్వదా అతీతమైందని, సర్వులకంటే ఆయన
విలక్షణుడని, సర్వులలోకెల్లా ఆయన సర్వశ్రేష్టుడని తెలుస్తుంది. ఇంకా అ సర్వేశ్వరుని అస్తిత్వం
నిరుపమానమైనదని ముఖ్యంగా ఆయన అస్తిత్వం అవిభాజ్యమైన ఏకాంకమని బోధపడుతుంది. కనుక
సృష్టికర్త అయిన సర్వేశ్వరునికి సాటిగా గాని, సహవర్తులుగా గాని ఎవరినైనా ఎంచే అవకాశమూ లేదు,
ఆస్కారమూ లేదు. ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే మేటి. సర్వేశ్వరుడు సమస్తానికి
నియామకుడు. సమస్తమూ నియమితము. సర్వేశ్వరుడు ఒక్కడే ఉపాస్యుడు. అపరా ప్రకృతేకాక పరాప్రకృతి
సైతం ఆయనను ఉపాసించేదే. దీనికి సాక్ష్యం

క్షరం ప్రధాన మమృతాక్షరం హరః
క్షరాత్మానావీశతే దేవ ఏకః శ్వేతాస్వతరోపనిషత్తు 1:10

పదార్థం నాశనమయ్యేది. భగవంతుడు నాశరహితుడు, అమరుడు, ఏక మాత్రుడైన ఆ భగవంతుడే
నాశనమయ్యే పదార్థాలన్నిటినీ మరియు జీవాత్మను పాలిస్తాడు. ఈ మంత్రం ప్రకారం- ఒక్క భగవత్తత్వం
తప్ప సర్వమూ నాశనమయ్యేదేనని అర్ధమవుతుంది. సర్వమూ అనగా అపరా ప్రకృతియే కాక పరాప్రకృతి
సంబంధమైన జీవాత్మతత్వము భగవంతుడు సంకల్పిస్తే అదీను నాశనమవుతుంది. దీనిని బట్టి జీవాత్మ
నిత్యత్వము, భగతత్వపు నిత్యత్వము వంటిది కాదని రూఢి అవుతుంది. ఇంకా, భౌతిక తత్వమైన
పంచభూతాత్మక పదార్థమే కాక అభౌతిక పదార్థమైన జీవాత్మ సైతము భగవంతుని శాసనానికి లోబడి ఉన్న
పాలితమేనని పై మంత్రము స్పష్ట పరుస్తుంది. దీనిని బట్టి 'పదార్థ తత్వాన్ని' గాని 'జీవాత్మ తత్వాన్ని' గాని '
భగవత్తత్వము'తో సమానంగా ఎంచరాదని తెలుస్తుంది.
అప్పుడే భగవంతుని వైశిష్ట్యాన్ని యథార్థంగా గుర్తించిన వారు కాగలం. తద్వారా ఆయన అనుగ్రహానికి
పాత్రులై మనం మనశ్శాంతిని పొందగలము. సర్వేశ్వరుని అద్వితీయతను అర్థం చేసుకోవాలంటే ఒక
విషయాన్ని గమనించాలి. అదేమిటంటే సర్వేశ్వరుని యొక్క శ్రేష్ఠత ఆయన సొంతం. అపరా ప్రకృతి శ్రేష్ఠత
సర్వేశ్వరుని 'భిక్ష' మరియు 'దానం'. సర్వేశ్వరుని నిత్యత్వమునకు కారణం ఆయన 'స్వతఃశక్తి' మరియు
'స్వీయ సామర్థ్యమే'. కాని పరాప్రకృతి నిత్యత్వమునకు కారణం సర్వేశ్వరుని 'ఊతము' ఆయన 'అనుమతి'
మాత్రమే. కనుక సర్వేశ్వరుని సృష్టి ఎంత గొప్పదైనప్పటికీ అది అతనితో ఏ విధంగానూ సమానం కాజాలదు.
కాబట్టి దేవతలుగాని, ఆత్మలుగాని, మహనీయులుగాని, మహాపురుషులుగాని ఎవరైనా సరే సర్వేశ్వరునితో
ఏ విధంగానూ సరితూగరు. కనుక సర్వేశ్వరుని అస్తిత్వంతో సమానంగా ఎవరిని ఎంచరాదు. ఈ విశ్లేషణను
బట్టి నేడు ప్రచారంలో ఉన్న ప్రారంభంలో పేర్కొన్న మూడు సిద్ధాంతాలు కూడా తప్పని తేలుతున్నాయి.
ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్న ఈ క్రింది శ్లోకాన్ని గమనించగలరు.

మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. -7:7

అర్జునా! నా కంటే వేరుగ మరియొకటి ఏదియు లేనే లేదు. దారమందు మణులవలె నాయం దీనమస్త
ప్రపంచము కూర్చబడినది. పై శ్లోకపు మొదటి పాదంలోని 'మత్తః పరతరం నాన్యత్కించి దస్తి' అన్న
వచనం ద్వారా 'నా కంటే వేరుగా మరొకటి ఏదియు లేదు' అని సర్వేశ్వరుడే స్వయంగా తన ఏకత్వాన్ని,
అద్వితీయతను ప్రకటిస్తున్నాడు. అందుకే 11:43 శ్లోకంలో 'తత్సమః న 'అస్తి' అంటే 'నీతో సమానమైన వాడు
ఈ చరాచర జగత్తులో లేనేలేడు' అని ఇంకా 'అప్రతిమ' అనగా నీవు 'ప్రతిమ' లేక 'విగ్రహము' కావు అని
అర్జునుడు కూడా సాక్ష్యమిస్తున్నాడు. దీనిని బట్టి సర్వేశ్వరుడు సాటిలేని అనుపమ అస్తిత్వం స్పష్టంగా
బోధ పడుతుంది. ఈ శ్లోకములలోని గమనార్హమైన విషయం ఈ సృష్టిలోని ఏ అస్తిత్వమూ ఆ ఏకేశ్వరుడైన
సర్వేశ్వరునికి సాటి సమానము కానే కాదు అన్నది.

మహనీయుల పట్ల మన సంబంధం ఎలా ఉండాలి ?

ఈ రోజు ఈశ్వర అస్తిత్వంతో సమానంగా భావించి, ఆరాధించబడుతున్న మహనీయులపట్ల మనం ఎలాంటి
సంబంధాన్ని కొనసాగించాలి? అన్నది ఒక ప్రశ్న. దీనికి సమాధానం మూడు భాగాలుగా ఉంది.
ఒక్కొక్కదానిని పరిశీలిద్దాం..

1. మహనీయులు అస్తిత్వపరంగా సామాన్య ప్రజలకంటే కనీసం వీసమెత్తు ఆధిక్యతను కలిగిలేరు అని
ఖచ్చితంగా నమ్మాలి.

2. మహనీయులు సామాన్యప్రజల కంటే ఒక ప్రత్యేక సంబంధాన్ని సర్వేశ్వరునితో కలిగి ఉంటారు.
అదేమిటంటే సర్వేశ్వరుడు 'శ్రుతి' ద్వారా వారితో ప్రత్యక్షంగా సంభాషిస్తాడు. ఎందుకంటే మానవాళి
సంస్కరణా యజ్ఞాన్ని ఆచరణాత్మకంగా వారిద్వారా నిర్వహించడానికి, ఈ కారణంచేత వారు సామాన్య
ప్రజల కంటే గొప్పవారయ్యారు. కనుక మనం వారిని మనకంటే చాలా గొప్పవారిగా ఆదరించాలి.

3. జనసామాన్యంపట్ల వారు ఎనలేని ప్రేమా వాత్సల్యాలు కలిగి ఉంటారు. ప్రజల మార్గ భ్రష్టత్వం వారిని
కలచివేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కొందరు దుష్టులు వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మానసిక, శారీరక
హింసలకు గురిచేస్తారు. అలాంటి తరుణంలో వారు అత్యంత ఓర్పును, అసమాన సహనాన్ని ప్రదర్శిస్తారు.
త్యాగమయ జీవితానికి ప్రతీకలుగా నిలుస్తారు. ఈవిధంగా వారు మనకంటే గొప్పవారయ్యారు. కనుక మనం
వారిని ఆదర్శంగా తీసుకొని, అనుసరించాలి. ఇది మహనీయులపట్ల మనం కలిగి ఉండవలసిన ఆలోచనా
దృక్పథం మరియు వారితో వ్యవహరించవలసిన తీరు. దీని వలన సర్వేశ్వరునితో మన పరాకాష్ట సంబంధం.
కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అంతేకాదు మహనీయుల ఆదర్శాన్ని అందుకునే ప్రయత్నం
సతతం సాగుతూ ఉంటుంది. తద్వారా నీతి, త్యాగాలవంటి విలువలు మన జీవితాలలో అంటుపోసుకొని
చిగురించి పుష్పిస్తూ ఉంటాయి. పర్యవసానంగా మానవ సమాజం యావత్తూ సుఖశాంతుల పరిమళాలతో
గుబాళిస్తుంది.

అశాంతికి మూలకారణం ఏమిటి ?
నేడు విశ్వవ్యాప్తంగా మానసిక ఆందోళన సర్వసామాన్యం అవుతూ పోతుంది. దీనికి కారణం ఏమిటో
అంతుచిక్కక పాశ్చాత్య మనోనిపుణులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. మంచి ఆరోగ్యం, గొప్ప
ఆర్థికస్థితి కలిగినవారు సైతం ఈ అశాంతి, ఆందోళనలకు గురి కావటం ఎంతో గంభీర సమస్య. దీనికి
ప్రత్యక్ష నిదర్శనం ఏమిటంటే నేడు శారీరక వైద్యుల కంటే మానసిక వైద్యులవద్ద జనం బారులు
తీరుతున్నారు. ఇది ఏదో బడుగు దేశాలస్థితో లేక వర్ధమాన దేశాల పరిస్థితోకాదు. భౌతికంగా అన్ని
రంగాలలో గణనీయమైన వికాసాన్ని సాధించిన అగ్రదేశాలలోని దుస్థితి! అమెరికా, పాశ్చాత్యదేశాల
నిపుణులు సైతం ఈ సమస్యను అధిగమించే విషయంలో చేతులెత్తేసిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది.
కనుక ఈ మానసిక ఆందోళనను తొలగించడానికి ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన సాంప్రదాయక
ప్రయత్నాలకు భిన్నంగా ఆలోచించవలసిన అవసరం వేడు ఎంతైనా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం
ఏమిటి? అని ప్రశ్నిస్తే గీతాశాస్త్రం ఈ క్రింది విధంగా సమాధానం చెబుతుంది..

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి - 5:29

భగవంతుడు యజ్ఞములకును.. తపస్సులకును భోక్త సమస్త లోకము లకును, లోకేశ్వరులకును అధిపతి
సమస్త ప్రాణులకు ఆత్మీయుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు శాంతి లభించును.

ఈ శ్లోకంలో సృష్టికర్త యొక్క మూడు ప్రత్యేకతలు పేర్కొని వాటిని తెలుసుకుంటే శాంతి లభిస్తుందని
తెలియజేయబడుతుంది. ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కనుక దీనిని ఇట్టే కొట్టి పారేయక
ఇది ఎలా సాధ్యమో గమనించగలరు. మనో ప్రశాంతతను సాధించడానికి నేడు ఒక భిన్నమైన కోణంలో
ఆలోచించాలని మేము ముందే కోరి ఉన్నాము. అయితే సృష్టికర్త ప్రత్యేక లక్షణాల వాస్తవికత ఏమిటో ఇంకా
ఆ లక్షణాలను గుర్తిస్తే శాంతి లభించడం ఎలా సాధ్యమో గమనిద్దాం. దీనికి ముందు యజ్ఞములు మరియు
తపస్సులు అంటే ఏమిటో గమనించగలరు.

యజ్ఞములు అనగా ఏమిటి?

'యజ్ఞములు' అనగా సృష్టికర్త ద్వారా మానవాళి ఆచరణార్థం శాసించబడిన వివిధ ఆజ్ఞలు, వాటిలోని కొన్ని
మౌలిక ఆజ్ఞలు సంక్షిప్తంగా ప్రస్తావిస్తున్నాము గమనించగలరు.

1. 'దేవయజ్ఞం' అంటే సృష్టికర్తపట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి. ఎలాంటి దృక్పథం కలిగి
ఉండకూడదు అనే విషయాల ఆజ్ఞలు..

2.'పితృయజ్ఞం' అనగా తల్లిదండ్రుల హక్కులేమిటి? వాటి నిర్వర్తన విషయంలో విధినిషేధాలకు సంబంధించిన ఆజ్ఞలు.

3. 'రుషియజ్ఞం' అనగా రుషులు లేక ప్రవక్తలతో ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించకూడదు? అనే
విషయాల ఆజ్ఞలు.

 4. 'నృయయజ్ఞం' అనగా తోటి మానవుల హక్కులు ఏమిటి? వాటిని ఎలా నిర్వర్తించాలి? ఆ సందర్భంగా
తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన ఆజ్ఞలు.

5. 'భూతయజ్ఞం' అనగా జంతుజాలం పట్ల ఎలాంటి దయాభావం కలిగి ఉండాలి. వాటిపట్ల ఎలా
వ్యవహరించాలి? ఎలా వ్యవహరించకూడదు? అనే విషయాల ఆజ్ఞలు.

వీటినే 'పంచమహా యజ్ఞములు' అని అంటారు.

తపస్సులు అనగా నేమి?

'తపస్సులు' అనగా మనిషిని మానసికంగా సృష్టికర్తకు చేరువ చేయడానికి ఏర్పరచిన కొన్ని ప్రార్ధనా
రీతులు మరియు ఉపాసనావ్రతాది కర్మలు.

సృష్టికర్తను భోక్తగా గుర్తించకపోతే అశాంతి ఎలా ఏర్పడుతుంది?

ప్రతికర్మనూ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఎందుకంటే ఆయనే భోక్త అనగా స్వీకరించే వాడు.
మనిషి చేసే సదాచరణను అంగీకరించి, దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ఆయనే. కనుక ఒక భక్తుడు
ఏదైనా ఒక కర్మను ఆచరించబోయేముందు రెండు విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలి.

1. ఈ కర్మ ఈశ్వరాజ్ఞయా? కాదా?
2. ఈ కర్మను స్వీకరించి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవడు? ఆ ఈశ్వరుడే.
పై రెండు విషయాల పూర్తి స్పృహతో కర్మను చేయాలి. సృష్టికర్త ఆజ్ఞకు భిన్నమైన కర్మను ఆదేశించేవాడు
ఎంత గొప్పవాడైనా వాని ఆజ్ఞను ఎట్టి పరిస్థితులలోనూ పాటించరాదు. క్రింది శ్లోకం గమనించండి.

యత్కరోషి యద యజ్ఞుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌత్తేయ తత్కురుష్వ మదర్పణమ్. - 9:27

ఓ అర్జునా! నీవేది చేసినను, తినినను, హోమమొనర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని
నాకర్పింపుము.

'సమస్త కర్మములను నాకర్పింపుము' అని సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నాడు.
అయినప్పటికీ కొందరు ఈ ఆజ్ఞకు పూర్తి విరుద్ధంగా, 'తమ కర్మలను ఎవరికి అర్పించినా ఆయనకు
అర్పించినట్లే' అని భ్రమిస్తున్నారు. అలాగే ప్రచారం కూడా చేస్తున్నారు. సర్వసామాన్యంగా ఎవరికి
తోచినమార్గంలో వారు ప్రజలను నడిపించడం ప్రారంభించారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రతిపాదించే
"హేతుబద్ధమైన ఆలోచన, శాస్త్రీయమైన ఆచరణా' రంగాలు కనుమరుగైపోయాయి. ఇక అక్కడినుండి
'బుద్ధికందని అలోచనలు మరియు నిరర్థకమైన ఆచారాలు అన్ని వైపులనుండి ముసురుకున్నాయి.
పర్యవసానంగా శాంతికి, సౌభాగ్యాలకు మూలమైన 'ఏకాత్మకత' (UNIFORMITY) ని సమాజం కోల్పోయి
అశాంతికి, వికారానికి నిలయంగా మారిపోయింది.

సర్వేశ్వరుణ్ణి (సృష్టికర్తను) భోక్తగా గుర్తిస్తే శాంతి ఎలా లభిస్తుంది ?
వాస్తవానికి సృష్టిలోని ఏశక్తీ మరొకదానికి ఆజ్ఞలను ఇవ్వనూలేదు, ఆజ్ఞపాలన చేస్తున్న వారిని గ్రహించి
అనుగ్రహించనూ లేదు. అయితే ఆజ్ఞలను ఇచ్చే అధికారం మరియు ఆ ఆజ్ఞలు పాలించబడుతున్నాయా,
లేదా అనేది గ్రహిస్తూ, గమనిస్తూ ఉండే శక్తి కేవలం ఆ ఒక్క సర్వేశ్వరునికి మాత్రమే ఉంది. సర్వేశ్వరుడు
భోక్త అంటే ఇదే. ఈ సత్యాన్ని ప్రజలలో ప్రచారంచేసి, సకలజనులను ఆ ఏకేశ్వరుని ఆజ్ఞల ప్రకారం తమ
క్రతువులను మలచుకునేలా చేయాలి. ఇంకా ఆ తపస్సు ఆయనకే అర్పించబడాలి. అప్పుడే సమాజం
కోల్పోయిన 'ఏకాత్మకత' (UNIFORMITY) తిరిగి పునరుద్ధరించబడి శాంతి, సౌఖ్యాలను సంతరించుకుంటుంది.
ఈ విధంగా సృష్టికర్త ఒక్కడే సమస్త యజ్ఞములకు తపస్సులకు 'భోక్త' అని గుర్తించడం ద్వారా శాంతి
ఏర్పడుతుంది.

సమస్తలోకములకు, లోకేశ్వరులకు అధిపతి అంటే?

సర్వేశ్వరుడు సృష్టించిన రెండు ప్రకృతులను గురించి గత పంక్తులలో పరిశీలించాము. అవి:
ఒకటి 'పరాప్రకృతి', రెండు 'అపరాప్రకృతి'. ఈ రెండు ప్రకృతులతో నిర్మింపబడిన ఈ మహావిశ్వం
నిరంతరాయంగా సాగిపోతూ ఉంది. ఈ అనంత సృష్టిలో ఎన్నోశక్తులు పని చేస్తున్నాయి. ముందుగా
పరాప్రకృతికి సంబంధించిన అస్తిత్వాలను గురించి పరిశీలిద్దాం.

సర్వేశ్వరుని సృష్టిలో పరాప్రకృతితో ఏర్పడిన ఈ వ్యవస్థ అత్యంత బలోపేతమైంది. ప్రచండ శక్తివంతమైన
జీవులు ఇందులో ఉన్నాయి. వాటిని 'ఇంద్ర, యమ, వరుణ మరియు కుబేరుల'ని అంటారు. వీరిని
దిక్పాలకులు అని కూడా పిలుస్తారు. వీరు వివిధ బ్రహ్మాండములను నియంత్రిస్తూ ఉంటారు. వారు
దివ్యప్రభువులు. వారికి ఉన్న శక్తులు మానవ ఊహకే అందవు. వీరు పూర్తి భూగోళాన్ని ఒక చిన్న
బంతిలాగ తమ చేతితో పట్టు కోగలరు. వారు అంతటి శక్తిమాన్యులు. అత్యంత ధైర్యశాలి అయిన మానవుడు
సైతం వారిని అసలు రూపంలో చూస్తే భయకంపితుడైపోతాడు. వీరికి సృష్టిలోని వివిధ విభాగాలపై
ఆధిపత్యం ఉంది. ఇంకా వారిక్రింద పనిచేసే దేవతలు కోటానుకోట్లుగా ఉంటారు.

సర్వేశ్వరుని సృష్టిలో అపరాప్రకృతి అనే మరొక వ్యవస్థ పనిచేస్తుంది. అదే ఈ ప్రపంచము. ప్రపంచము
అనగా పంచభూతములతో నిర్మించబడినదని అర్థం. ఇందులో ఉన్న సృష్టితాలలో చాలా గొప్పవి
పాలపుంతలు, నక్షత్రమండలాలు. ఇవికూడా ఎంతో గొప్పశక్తులు కలిగి ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు,
భూమి ఇతర గ్రహాలు ఆకర్షణ. శక్తి కలిగి ఉంటాయి. ఈ భూమిపై పర్వతాలు, చెట్లూ, చేమలకు పెరిగే శక్తి,
నదులు సముద్రాలకు ప్రవహించే శక్తి, చేపలకు ఈదే శక్తి, పక్షులకు ఎగిరే శక్తి ఇలా ప్రతిజీవ మరియు నిర్జీవ
సృష్టితాలన్నింటికీ ఎంతో కొంత శక్తి ఉంది. చివరకు అణువుకు కూడా చైతన్యశక్తి ఉంది.

ఇక ఈ మానవుడు పర, అపర పదార్థాల మిశ్రమంగా సృష్టించబడ్డాడు. అంటే ఇతని శరీరంలోని 'ఆత్మ'
పరాప్రకృతికి మరియు 'శరీరం' అపరాప్రకృతికి సంబంధించినది. ఈ మానవునిపై ప్రబలంగా ప్రభావం
చూపేది మనోవాంఛల శక్తి. ఇది కాక కుటుంబ మరియు సామాజిక సాంప్రదాయాల శక్తి కూడా మనిషిపై
తన బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఈ విధంగా అనేక శక్తులమధ్య బందీ అయివున్న ఈ మానవుడు, తను ఏశక్తిని సంతృప్తి పరచాలో,
ఏశక్తి అనుగ్రహం కొరకు ప్రాకులాడాలో, ఏశక్తి దయపై ఆధారపడాలో నిర్దిష్టంగా తెలుసుకోనంతవరకు
అతనికి శాంతి లభించదు. మనిషి ఏకాగ్రతతో, ప్రశాంతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే అతనిపై
ఎవరో ఒకే ఒక అధికారి సర్వాధికారం కలిగి ఉండాలి. మనిషి తన నైజం పరంగా ఏ ఒక్కనికో జవాబుదారుగా
ఉండగలడేగాని, ఒకేసారి ఎందరికో సంజాయిషీ చెప్పుకోవడం అనేది అతనిని గందరగోళానికి అశాంతికి
గురిచేస్తుంది.

ఈనాటి మానసిక సమస్యలకు, శారీరక అనారోగ్యాలకు మరియు సామాజిక సంక్షోభాలకు ప్రబలకారణం
మనిషి యొక్క ఈ మానసిక ఏకాగ్రతారాహిత్యమే. ఈ మనోవేదనను తొలగించుకోవడానికే అగ్రరాజ్యాల
ప్రజలనుండి బడుగుదేశాల జనుల వరకు ఎవరిని చూచినా ఉరకలు, పరుగులు. విచిత్ర విడ్డూర వేషాలు
మరియు చిత్రవిచిత్ర వ్రతాలు. అర్థంలేని ఆలోచనా దృక్పథాలు, నిరర్థకమైన ఆచార సాంప్రదాయాలు
విజృంభించి ప్రజలలో విపరీత పోకడలు సర్వసామాన్యం అవుతూ పోతున్నాయి. ఒకవైపు ఆయా శక్తులను
సంతృప్తి పరచడానికి శాంతులూ వ్రతాలూ చేస్తూ ఉన్నారు. మరోవైపు జంతుబలులే కాక తమ కన్న బిడ్డలను
సైతం బలి ఇచ్చే వైనం మనకు కనిపిస్తుంది. ఈ క్రతువులన్నీ ఎందుకు అంటే శాంతిని సాధించడానికి అని
అంటారు. కాని చివరికి శాంతి మాత్రం శూన్యం!

శాంతిని సాధించడం ఎలా ?

ఈ శాంతిని సాధించాలని అనుకుంటున్న ప్రతివ్యక్తి తన చుట్టూ వ్యాపింపబడి' ఉన్న ఆయా శక్తుల
విషయమై ఈ క్రింది ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాబట్టాలి. అప్పటికి గాని ఎవనికి శాంతి సంప్రాప్తం
కాజాలదు.
1వ ప్రశ్న. ఆయా వ్యవస్థలు ఏమిటి?
2వ ప్రశ్న. ఈ వ్యవస్థలు లేక లోకాలు స్వతహాగా ఉనికిలోనికి వచ్చాయా? అంటే అవిస్వయంభవులా? లేక వాటిని
వివిధ శక్తులు కలసి సృష్టించారా? 3వ ప్రశ్న. ఆయాలోకాలను నిర్వహించే శక్తులు ఏమిటి? అవి స్వయంభవులా?
4వ ప్రశ్న. ప్రచండ శక్తిమాన్యులైన ఆయా దేవతలు సంపూర్ణంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాయా?
లేక పాక్షికంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాయా?
ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాబట్టాలి. ఇంకా ఒక మనిషిగా తాను అసలు ఏశక్తికి లోబడి ఉండాలి?
అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనిషికి శాంతి లభించగలదు. కనుక
పైన పేర్కొన్న ఒక్కొక్క ప్రశ్నకు గీతాశాస్త్రం నుండి సమాధానాలు రాబట్టటానికి ప్రయత్నిద్దాం. అయితే దానికి
ముందు సృష్టికర్తను గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి.

సర్వేశ్వరుడి (సృష్టికర్త) మౌలిక లక్షణాలు ఏమిటి ?

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ 
అసమ్మూఢస్స మర్యేషు సర్వపాపైః ప్రముచ్యతే -10:3

ఎవడు నన్ను పుట్టుక లేనివానిగను, అనాదిరూపునిగను, సమస్తలోకము లకు నియామకునిగను
తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో జ్ఞానియై సర్వ పాపములనుండి లెస్సగా విడువబడుచున్నాడు.

సర్వేశ్వరుడి యొక్క మౌలిక లక్షణాలను పైశ్లోకం వివరిస్తుంది.
1. సృష్టికర్త 'అజం' జన్మించనివాడు అనగా జీవరాశులవలె పుట్టేవాడు కాడు.
2. సృష్టికర్త 'అనాది' ఆది లేక ప్రారంభం లేనివాడు. అనగా సృష్టిలేని కాలం గతించింది. కాని ఆయన లేని
కాలం గతించలేదు.. 3. సృష్టికర్త 'సర్వలోక మ హేశ్వరం' అనగా సర్వలోకాలను మరియు లోకేశ్వరులను
నియమించిన వాడు. లేక వాటిని స్థాపించినవాడు. అందుకే ఆయన మహా+ ఈశ్వరుడు. అనగా మహేశ్వరుడు
అయ్యాడు.

సృష్టికర్త యొక్క మరికొన్ని లక్షణాలు.
మయాzధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్
హేతునానేన కౌత్తేయ జగద్విపరివర్తతే -9:10

ఓ అర్జునా! అధ్యక్షుడనైయున్న నాచేత ప్రకృతి చరాచర ప్రపంచమంతను సృజించుచున్నది.
ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.
ఇక్కడ సర్వేశ్వరుని మూడు ప్రత్యేక లక్షణాలు చెప్పబడుతున్నాయి. అవి:
1. చర-అచర సృష్టిరాశులను సృష్టించిన వాడు సర్వేశ్వరుడే. అనగా ఒక్క సర్వేశ్వరుని ద్వారానే సృష్టిలోని
సమస్తానికి ఉనికి ప్రసాదించబడింది. సృష్టిలోని ఏఒక్క సృష్టి రాశీ స్వతఃశక్తితో ఉనికిని సంతరించుకోలేదు.

2. చర-అచర సృష్టిరాశులుగా ఏర్పడివున్న ఈ జగత్తులో 'చైతన్యం' కనిపిస్తుంది. ఆ చైతన్యం కూడా ఆయా
సృష్టిరాశులు స్వతఃగా కలిగిలేవు. అంటే సృష్టిరాశులలో దేనికి స్వతః చైతన్యశక్తి లేదని స్పష్టమవుతుంది.
దీనినిబట్టి సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఒక్కడే సమస్తానికి చైతన్య ప్రదాత అని అర్థమవుతున్నది.
3. ఒక్క సర్వేశ్వరుడే సృష్టికంతటికీ 'అధ్యక్షుడు'. అంటే సర్వేశ్వరుడు ఈ మహత్తర సృష్టిని రూపొందించి
గాలికి వదలివేయలేదని అర్థమవుతుంది. దీని ప్రకారం ఇక్కడ జరుగుతున్న ప్రతి మంచి-చెడుపై ఒక
నివేదిక సిద్ధమవ్వటం మరియు దానిని పరిశీలించి తుది తీర్పునివ్వటం జరుగుతుందని కూడా
తెలుస్తుంది. ఇదే గనుక జరగకపోతే సర్వేశ్వరుడు అధ్యక్షుడు అన్న మాటకు అసలు అర్థమే ఉండదు.
కనుక సర్వేశ్వరుడి సమక్షంలో ఒకరోజు నిలబడి సమాధానం చెప్పుకోవడం తప్పదన్న సంగతి
మరుపకూడదు.

సర్వేశ్వరుని యొక్క మరికొన్ని ప్రత్యేకతలు.
గతిర్భర్తా ప్రభుస్సాక్షి నివాసశ్శరణం సుహృత్
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్. 9:18

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొంద
దగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు నిక్షేపమును నాశరహితమైన బీజమును నేనే
అయియున్నాను.

ఈ శ్లోకము సృష్టికర్త యొక్క సమగ్రమైన పరిచయాన్ని అందిస్తుంది. ఆ సర్వేశ్వరునికి సంబంధించిన
మొత్తం పన్నెండు లక్షణాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. సర్వేశ్వరుని విశ్వసించే ప్రతి ఆస్తికుడు ఈ
లక్షణాలన్నిటినీ సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అతడు తనకు తాను ఆధ్యాత్మికునిగా
చెప్పుకునే అర్హత కలిగి ఉంటాడు. కనుక ఒక్కొక్క లక్షణాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి!

1. 'గతి' అనగా దిక్కు, మార్గము, లక్ష్యము అనే అర్థాలు చెప్పవచ్చు. సృష్టిలో ఎన్నో వ్యవస్థలు పని
చేస్తున్నాయి. ప్రతి వ్యవస్థకూ ఒక లక్ష్యం లేక కేంద్రకం అంటూ ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని
ఆ వ్యవస్థ ప్రశాంతంగా క్రమశిక్షణతో సాగుతూంది.
ఉదాహరణకు అణువులోని ఎలక్ట్రానులు మరియు ప్రోటానులు 'న్యూక్లియస్' అనే కేంద్రకాన్ని దిక్కు లేక
గతిగా చేసుకొని చలిస్తున్నాయి. అందుకే ఈ సూక్ష్మజగత్తు ప్రశాంతంగా మనగలుగుతుంది.
సౌరకుటుంబంలో కూడా ఈ సూత్రమే పనిచేస్తుంది. నవగ్రహాలు, వాటి ఉపగ్రహాలు పరస్పరం ఢీకొనకుండా,
శూన్యంలో చెదిరిపోకుండా సూర్యబింబాన్ని గతిగా లేక కేంద్రకంగా చేసుకొని పరిభ్రమిస్తున్నాయి. అందుకే
వాటిలోనూ గంభీర ప్రశాంతత. ఈ సూత్రాన్నే ఆధారంగా చేసుకుని సువిశాల పాలపుంతలు సయితం దౌడు
తీస్తున్నాయి. అందుకే వాటిలోనూ గంభీర ప్రశాంతత!

అంటే 'గతి' లేక 'కేంద్రకం' అనే ప్రత్యామ్నాయం లేకుండా 'అనేకం'గా ఉన్న విభిన్న అస్తిత్వాలు 'ఏకం'గా
ఉంటూ, సామూహికంగా సాగలేవని ఈ పరిశీలన ద్వారా అర్ధం అవుతున్నది.ఆయా సృష్టిరాశులు తమ గతులను తమ కేంద్రాలుగా చేసుకొని సాగుతున్నాయి. అందుకే 'అండం నుండి
బ్రహాండం' వరకూ ఎక్కడా, ఎలాంటి క్రమరాహిత్యమూ ఏర్పడడం లేదు. అణువునుండి అనంతం వరకు
ప్రశాంతతే ప్రశాంతత! కారణం? సకల గతులు ఒక్క సర్వేశ్వరుని మాత్రమే 'పరమగతి' గా చేసుకుని
చలిస్తున్నాయి, తరిస్తున్నాయి. ఇది ఈ సువిశాల విశ్వపు ప్రధాన జీవనస్రవంతి. అందులో చేరి
సాగినప్పుడే ప్రశాంతత. దాని నుండి ఏ మాత్రం తప్పినా పర్యవసానం ప్రళయమే. దాని ఫలాలే ఈ
అశాంతి ఆందోళనలు.

2. 'భర్త' భరించువాడు. అంటే సర్వేశ్వరుడు సృష్టికి 'కర్త'యేకాక, దానికి 'భర్త' కూడా అనగా సంరక్షుడు
మరియు పరిపోషకుడు కూడా. అంటే విశ్వంలోని ఏశక్తీ తన 'స్వీయ ఉనికి' మరియు 'స్వీయ పరిపోషక'
సామర్థ్యాలను కలిగిలేదని తెలుస్తుంది. కనుక ఒక్క సర్వేశ్వరుడే 'సర్వజగద్రక్ష' మరియు 'సర్వజీవ
పరిపోషకుడు' అని ద్యోతక మవుతోంది.

3. 'ప్రభువు' అంటే యజమాని, శాసించేవాడు. ఈ విశ్వవ్యవస్థను, సకలశక్తులను శాసించే వాడు. దీని
ప్రకారం సృష్టిలోని సకలశక్తులను సైతం శాసించే సర్వేశ్వరుడే 'పరమప్రభువు' అని తెలుస్తుంది.
సృష్టిలోని నకల వ్యవస్థలను, వాటి నిర్వాహకులను పరిరక్షించేవాడు మరియు పరిపోషించేవాడు మరియు
వాటిని శాసించేవాడూ సర్వేశ్వరుడే ఎందుకయ్యాడు? ఎందుకంటే ఈ అనంత విశ్వవ్యవస్థకు ఆయనే
'యజమాని' కనుక,

4. 'సాక్షి' అనగా సర్వసృష్టిలోని సకల లోకములను, వాటిలోని సమస్త జీవుల

మంచి-చెడు కార్యములను ఆ సర్వేశ్వరుడు ఏకరీతిగా వీక్షిస్తున్నాడు. ఇంకా భూత, భవిష్యత్, వర్తమాన
కాలాలలోని అన్ని విషయాల సంపూర్ణ అవగాహనను కూడా ఆయనే కలిగి ఉన్నాడు. ఆయన తప్ప మిగిలిన
జీవులు పరిమిత విషయాల అసంపూర్ణ జ్ఞాన్నాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. కాని ఆయన సర్వజ్ఞత
పరాకాష్ఠ స్థాయిలో ఉంటుంది. అందుకే సర్వేశ్వరుని 'సర్వజగత్సాక్షి' అని అంటారు.

5. 'నివాసః' అనగా నివసించు ప్రదేశం. సాధారణంగా నివాసాలు విభిన్నంగా ఉంటాయి. ఇష్టంలేని నివాసాన్ని
విడచి ఇష్టం ఉన్న నివాసంలోకి మారిపోవచ్చు. ఒక నివాసంలో ఉన్నప్పుడు మరొక నివాసంతో సంబంధం
ఉండకపోవచ్చు. అయితే సర్వేశ్వరుని నివాసం అనగా సర్వసృష్టిలోని సకలజీవులు నిలబడిఉన్నా, కూర్చొని
ఉన్నా నిద్రలో ఉన్నా చివరికి జన్మించడానికి ముందు మరియు మరణించిన తరువాత సైతం ఆ
సర్వేశ్వరునియందే ఉంటాయి. అంటే సర్వేశ్వరుని పరిధులను విడిచి వేరే పరిధులలోనికి ప్రవేశించే
అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన రాజ్యానికి ఎల్లలులేవు. సర్వం ఆయన సన్నిధిలోనే ఉన్నది.
అందుకే సర్వేశ్వరుడు 'నివాసః' అని పిలువబడుతున్నాడు.

6. 'శరణం' అనగా శరణుప్రదాత లేక రక్షించువాడు. చరా-అచర సృష్టిలోని శక్తులన్నిటినీ ఆదుకునేవాడు.
పరిరక్షించేవాడు ఆ సర్వేశ్వరుడు మాత్రమే. సాధారణంగా రక్షించేవారు ఎందరో ఉండవచ్చు.
అయితే వారందరూ మరొకరి సంరక్షణ ఆధారంగా మనగలుగుతున్న వారే. అంటే సృష్టిలోని ఏ ఒక్కటీ తన
మనుగడకు 'స్వతఃసంరక్షణా సామర్థ్యం' కలిగిలేదు. పైగా ఈ శక్తులన్నిటికీ ఎప్పటికైనా అంతరించిపోయే
ప్రమాదం వెన్నంటి ఉంది. కాని సర్వేశ్వరుడు మాత్రం శాశ్వతంగా, ఎల్లకాలం పరిరక్షించే ఏకైక
పరమరక్షకుడు. ఎందుకంటే ఆయనకు అంతం లేదు. అందుకే సర్వేశ్వరునికి 'శరణమ్' అని అంటారు.

7. 'సుహృత్' అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించక నిర్ద్వందంగా పరుల సంక్షేమాన్ని కోరేవానిని సుహృత్
అంటారు. సర్వసృష్టిలోని సకలజీవుల ద్వారా తనకు లేశమాత్రమైన ప్రయోజనం లేకపోయినప్పటికీ
సమస్తజీవులకు సర్వేశ్వరుడు మేలు చేస్తూనే ఉంటాడు. సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడైనప్పటికీ ఎలాంటి
అహంకారానికి లోనుకాక తన సృష్టిపట్ల మైత్రీభావం కలిగి ఉంటాడు. అందుకే సర్వేశ్వరుడు 'పరమహితైసి'గా
పిలువ బడుతున్నాడు.

8. 'ప్రభవః' అనగా ప్రభవింపజేసేవాడు లేక సృష్టించేవాడు. సృష్టితమునకు అతీతమైనవాడు. ఒక్క సృష్టికర్త
మాత్రమే. ఆ ఒక్క సర్వేశ్వర శక్తితప్ప సకలశక్తులు సృష్టితములే. అత్యల్పమైన అపరా ప్రకృతియేకాక,
ఎంతో శక్తివంతమైన పరా ప్రకృతి కూడా సర్వేశ్వరుని సృష్టియే! అందుకే సర్వేశ్వరుని మాత్రమే 'ప్రభవః'
అని కీర్తించాలి.

9. 'స్థానమ్' అనగా ఆధారము లేక ఊతము. సృష్టిలోని సకలశక్తులూ తమ స్వీయ శక్తితో నిలబడి లేవు. తన
స్వీయశక్తి సామర్థ్యాలతో నిలిచి ఉండే వాడు ఆ ఒక్క సర్వేశ్వరుడే. ఇతర అస్తిత్వాలన్నిటికీ శక్తి, సామర్థ్యాలను
ప్రసాదించినవాడు ఆ ఒక్క సర్వేశ్వరుడు మాత్రమే. అందుకే ఆ సర్వేశ్వరుడినే 'స్థానమ్' అని సకలవేదాలు
నొక్కి వక్కాణిస్తున్నాయి.

10. 'ప్రలయః' అనగా అంతము లేక వినాశనము. విశ్వంలోని సకల సృష్టితాలూ స్వతఃగా నాశనమయ్యే
కనీస శక్తి కూడా కలిగిలేవని తెలుస్తోంది. అంటే సృష్టికర్త సంకల్పించినప్పుడు మాత్రమే ఏసృష్టి అయినా
అంతం కాగలదు. అందుకే సర్వేశ్వరుడు నాశనం లేక అంతం చేసేవాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

11. 'విధానం' అనగా ఒక వస్తువును దీర్ఘకాలంపాటు సురక్షితంగా ఉంచగలిగే స్థానము. సృష్టిలోని ఏదయినా
ఒక వ్యవస్థగాని లేక ప్రాణిగాని ఒకవేళ నిత్యత్వం కలిగి ఉందంటే, అది దాని స్వంతసామర్ధ్యం కాదు.
నిత్యుడయిన సర్వేశ్వరుని యొక్క నిధానం అనే సామర్థ్యం ఆధారంగానే ఆయా వ్యవస్థలు, శక్తులు
నిత్యత్వాన్ని పొందుతున్నాయి. కనుక ఒక్క సర్వేశ్వరుడు మాత్రమే 'విధానం'అనే సామర్థ్యం కలిగి ఉన్నట్లు
శాస్త్రాలు తెలుపుతున్నాయి.

12. 'బీజమవ్యయమ్' ఈ వాక్యం రెండు పదాల మిశ్రమం. ఒకటి 'బీజమ్' మరియు రెండవది 'అవ్యయమ్'.
అ. 'బీజము' అనగా మూలము, హేతువు లేక కారణము. అయితే దీనికి రెండు అర్థాలు వస్తాయి.
ఉదాహరణకు ఒక బాలుడిని చూపి- 'వీడి జన్మమునకు నేను బీజము (కారణము)ను' అని అంటే ఆ
జన్మించినవాని అస్తిత్వము మరియు జన్మనిచ్చిన వాని అస్తిత్వము వస్తుతః ఒక్కటే అవుతాయి.
ఎందుకంటే పుట్టిన వాడు జన్మనిచ్చిన వాని 'జన్యువు' (GENES) లనే పంచుకుని పుట్టాడు కనుక.
రెండవ అర్థం ప్రకారం ఉదాహరణకు 'ఆ ఇల్లు నిర్మించబడడానికి నేను బీజము (కారణము)ను'.
దీనిననుసరించి ఆ ఇల్లు నా మూలముగా లేక నాకారణముగా నిర్మించబడింది అనే అర్థం వస్తుంది.
కాని ఆ ఇల్లు వస్తుతః నా అస్తిత్వంతో ఏమాత్రం పొంతన కలిగి ఉండదు. ఎందుకంటే అది నా
ఆస్తిత్వంలోని పదార్థం ద్వారా నిర్మించబడలేదు. మరో విధంగా చెప్పాలంటే నాకు అతీతమైన పదార్థంతో
నిర్మించ బడిందన్నమాట.

ఈ విశ్లేషణ ఆధారంగా సర్వేశ్వరునికి సృష్టికీ మధ్యనున్న బీజసంబంధం రెండవ అర్ధంలోనే కాని మొదటి
అర్థంలో మాత్రంకాదు. దీనికి ఆధారంగా క్రింది శ్లోకాన్ని గమనించండి.

యస్మాత్ర మతీతో హమక్షరాదపి చోత్తమః
అతో స్మి లోకే వేదే ప్రథితః పురుషోత్తమః - 15:18

నేను (సర్వేశ్వరుడు) క్షరస్వరూపునికంటే మించినవాడను, అక్షరరూపుని కంటే శ్రేష్ఠుడను అయి యున్నందున
ప్రపంచమందును, వేదము నందును 'పురుషోత్తముడు' అని ప్రసిద్ధికెక్కి యున్నాను.
పై విషయాన్ని సర్వేశ్వరుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు. సర్వేశ్వరుని ఈ ప్రకటనకు పూర్తి భిన్నంగా
‘ఆ సర్వేశ్వరుడే విశ్వంలోని ఇన్ని రూపాలలో అభివ్యక్తమవుతున్నాడు' అని ప్రకటించడం శాస్త్ర విరుద్ధం
కాదా? కనుక సర్వేశ్వరుడిని సృష్టి మూల 'బీజం'గా విశ్వసించాలేగాని ఈ సృష్టి యొక్క అస్తిత్వం వస్తుతః
సృష్టికర్త అస్తిత్వంతో సమానం అనే అర్థంలో నేను బీజము (కారణం) అనే అర్థాన్ని తీసుకోకూడదు.

ఇ. 'అవ్యయము' అనగా ఏనాటికీ నశించనివాడు. సృష్టిలోని పరాప్రకృతి సైతం నశించవచ్చు ఒక వేళ
సర్వేశ్వరుడు సంకల్పిస్తే. కాని ఒక్క సర్వేశ్వరుడు మాత్రమే ఏనాటికీ నశించడు. ఆ సర్వేశ్వరుని విషయంలో
కనీసం అలా సందేహించే అవకాశం. లేశ మాత్రంగానైనా లేదు. అందుకే ఒక్క సర్వేశ్వరుడినే
'బీజమవ్యయమ్' ఎన్నటికీ నశింపని మూలకారకుడు అని నమ్మాలి.

సర్వేశ్వరుని యొక్క పై లక్షణాలలో దేనినీ తిరస్కరించటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ
శాస్త్రోక్తములు. ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మన ఆలోచనా ఆచరణా రంగాలను మలచుకోవాలి.
అప్పుడు మాత్రమే మనో ప్రశాంతత లభ్యం కాగలదు. ఈ విషయం గత పంక్తులలో ప్రస్తావించబడింది.
ముఖ్యంగా ఈ అనంత విశ్వంలో జడ మరియు చైతన్యవంతమైన అనేక శక్తులు పనిచేస్తున్నాయి.
వాటి యథార్థతను మరియు వాటిపట్ల ఎలాంటి ఆలోచనా సంబంధాలను కలిగి ఉండాలో కూడా స్పష్టంగా
నిర్ధారించుకోవాలి. ఆయా శక్తులపట్లగల నిర్ధారిత దృక్పథాలే మానసిక ఏకాగ్రతకు, ప్రశాంతతకు ప్రేరకాలు
కాగలవు. కనుక గతంలో ప్రస్తావించుకున్న ప్రశ్నలను తిరిగి ఈ క్రింది ఒక్కొక్కటిగా పేర్కొని, వాటి
యథార్ధతను మన సర్వేశ్వరుని గుణలక్షణాల వెలుగులో నిర్ధారిద్దాం..

గతంలో పేర్కొన్న ప్రశ్నలు - వాటి సమాధానాలు
1వ ప్రశ్న. ఆయ వ్యవస్థలు అవేమిటి ?
జవాబు. వాటిలో ఒకటి వ్యక్తములు, రెండు అవ్యక్తములు.
'వ్యక్తలోకములు': జీవరాశులు, సౌరకుటుంబము, పాలపుంతలు 'ఇహ ప్రకృతి' మొత్తం.
'అవ్యక్తలోకములు' ఆత్మలు, దేవతలు, స్వర్గలోకము, నరకలోకము మొదలగు 'పరాప్రకృతి' మొత్తం.

2వ ప్రశ్న. ఈ వ్యవస్థలు లేక లోకాలు స్వతహాగా ఉనికిలోనికి వచ్చాయా? అంటే అవి స్వయంభవులా?
లేక వాటిని వివిధ శక్తులు కలసి సృష్టించారా?
జవాబు. స్వయంభవుడు ఒక్క సర్వేశ్వరుడు మాత్రమే. కనుక దేనినీ స్వయంభవునిగా విశ్వసించరాదు.
ఈ లోకాలను వివిధ శక్తులు కాదు, ఒక్క సర్వేశ్వరుడే సృష్టించాడు.
ఉదా: మన సర్వేశ్వరుని ఒక లక్షణాన్ని గమనించండి 'ప్రభవః' ఈ లక్షణం ప్రకారం ఒక్క సర్వేశ్వరుడు
మాత్రమే సర్వానికి సృష్టికర్త. కనుక ఒక్క సర్వేశ్వరుడిని తప్ప మరెవ్వరినీ సృష్టికర్తగా భావించరాదు.
అలా భావిస్తే సర్వేశ్వరుని పట్ల మనం తిరస్కారానికి పాల్పడినట్లే.

3వ ప్రశ్న. ఆయాలోకాలను నిర్వహించే శక్తులు ఏమిటి? అవి స్వయంభవులా?
జవాబు. గతపంక్తులలో ఇంద్ర, యమ, వరుణ మరియు కుబేరులనే ప్రచండ శక్తి మంతులైన జీవులు
ఉన్నాయని ప్రస్తావించి ఉన్నాము. సర్వేశ్వరుని ఆదేశం ప్రకారం ఆ శక్తులే ఆయా వ్యవస్థలను
నియంత్రిస్తుంటాయి. ఆ శక్తులను సృష్టించినవాడూ సర్వేశ్వరుడే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా
10:8వ శ్లోకంలో 'అహం సర్వస్వ ప్రభవో' నేనే సమస్త జగత్తుకు ఉత్పత్తికి కారణమైన వాడను అని
ప్రకటిస్తున్నాడు. ఈ వాక్యంలో మొదటిది 'నేనే' అంటున్నాడు. కాని 'మేమే' అని అనటం లేదు.
రెండవది 'సర్వస్య' అనే పదం దేనిని సూచిస్తుంది? ఆయా 'లోకములను మరియు వాటి పాలకులను కూడా
అని అర్థం వస్తుంది. కనుక ఏశక్తినీ స్వయంభవునిగా భావించరాదు. అలా భావిస్తే సర్వేశ్వరుని పట్ల
తిరస్కారానికి పాల్పడినట్లే.

4వ ప్రశ్న. ప్రచండ శక్తిమాన్యులైన ఆయా దేవతలు సంపూర్ణంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాయా?
లేక పాక్షికంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాయా?
జవాబు. ఆయా దేవతాశక్తులు సంపూర్ణ స్వతంత్రులు కావు. సర్వేశ్వరుడు వాటిని పాక్షిక స్వాతంత్ర్యాన్ని
ప్రసాదించాడు. ఆ పాక్షిక స్వాతంత్ర్యాన్ని కూడా, అవి సర్వేశ్వరుని ఇచ్ఛ, అభీష్టాల ప్రకారం మాత్రమే
ఉపయోగించుకోగలవు. ఈ విషయం 10:8వ శ్లోకంలో స్పష్టమవుతుంది. 'మత్తః సర్వం ప్రవర్తతే' నావలననే
ఈ సమస్తమూ నడచుచున్నది. అని సర్వేశ్వరుడే స్వయంగా స్పష్టపరుస్తున్నాడు. దీనిని బట్టి ఈ
సర్వజగత్తులోని 'పర అపర' 'వ్యక్త అవ్యక్త' మరియు '- అచర' సృష్టితాలన్నీ ఆ సర్వేశ్వరుని ఆజ్ఞ ప్రకారం
మాత్రమే పని చేయగలవని బోధపడుతుంది. అటువంటప్పుడు ఈ శక్తులుకూడా మనకు ప్రత్యక్షంగా
'లాభంగాని- నష్టంగాని' తలపెట్టగలవని భావిస్తే అదీ సర్వేశ్వరుని పట్ల తిరస్కారానికి పాల్పడినట్లే అవుతుంది.
కనుక సృష్టిలోని సమస్త లోకాలకు వాటి నిర్వహకులైన సకల శక్తులకు 'కర్త. పోషకుడు, పరిరక్షకుడు,
నిర్దేశకుడు, నిర్వాహకుడు, శాసకుడు, అధిపతి' మరియు చివరికి వాటిని అంతమొందించేవాడూ ఆ ఏకైక
సర్వేశ్వరుడే. అందుకే ఆయనను మహా+ ఈశ్వరుడు= మహేశ్వరుడు అని అంటారు.

సృష్టికర్తను గూర్చిన మూడు దృక్పథాలను గీతాశాస్త్రం సమర్ధిస్తుందా?

సృష్టికర్తను గురించి నేటి సమాజంలో చలామణి అవుతున్న మూడు పరస్పర విరుద్ధ దృక్పథాలను
ప్రారంభ పుటలలో ప్రస్తావించి ఉన్నాము. ఇంతవరకూ సాగిన విశ్లేషణ: వెలుగులో వాటిని గీతాశాస్త్రం
సమర్థిస్తుందా లేదా అన్నది సంక్షేపము (BRIEF) గా తెలుసుకుందాం.

1. సృష్టి- సృష్టికర్త రెండు వేర్వేరు అస్తిత్వాలు.
సృష్టికర్త మానవాళి సంస్కరణ కొరకు మనిషిగా అవతరిస్తూ ఉంటాడు. అంటే మనిషిలా జన్మించి, మనిషిలా
పెరిగి మనిషికి ఉన్న సహజ బలహీనతలు కలిగి ఉంటాడు. కాని కొన్ని ఆదర్శాలు ఆచరించి చివరకు
మనిషిలానే తనువును చాలిస్తాడు. ఈ విధంగా అవతరించిన వారందరూ సాక్షాత్తు ఈశ్వరులే అనే ఆలోచన
ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

సర్వసృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడే సాక్షాత్తు మానవ ఆకారంలో ఈ లోకానికి దిగి వస్తున్నాడా?
అన్న ప్రశ్నకు లేక ఇతర ధార్మిక సందేహాలకు సరైన సమాధానం మన శాస్త్రాలు మరియు దైవ
అవతారాలుగా భావించబడుతున్న ఆ మహనీయుల ఆదర్శాలు లేక వారి ప్రబోధనలే ఇవ్వగలవు.
అంతకు మించిన 'నమ్మకమైన మాధ్యమం' (RELI ABLE SOURCE) మరొకటి ఉండదు. కాబట్టి దాని
ఆధారంగానే మన దృక్పథాల నిజనిర్ధారణ జరగాలి.

శ్రీరామచంద్రులవారి బోధనలను గమనించినా లేక వారి ఆదర్శ జీవితాన్ని చూసినా ఆయన-
"నేను సాక్షాత్తు ఆ విష్ణు మూర్తి అవతారాన్ని కనుక మీరు నన్ను సర్వేశ్వరుడిగా ప్రతిష్ఠించుకొని, ఆరాధించండి.
"అన్న వాంజ్మూలం (STATEMENT) ఇచ్చిన దాఖలా కనీసం ఒక్కటి కూడా కనిపించదు. ఇక, వారి ఆదర్శ
జీవితాన్ని పరిశీలిస్తే రావణుని చెరనుండి తన సహధర్మచారిణి అయిన సీతాదేవిని విడిపించటానికి
శ్రీరాములవారు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యుద్ధంలో తన అస్త్రాన్ని
ప్రయోగించటానికి ముందు ఆకాశం తట్టు తన శిరస్సును ఎత్తి, దానిని తన పవిత్ర నుదుటిపై పెట్టి,
ఆ సర్వేశ్వరుని స్మరించి, దానిని ప్రయోగించేవారు. వారి ఈ ప్రక్రియను పరిశీలిస్తే సర్వేశ్వరుని
దూతగానే శ్రీరాములవారు కనిపిస్తున్నారు. ఒకవేళ వారే సాక్షాత్తు సర్వేశ్వరుడై ఉంటే ఆయన
మరొకనిని ప్రార్థించి ఉండేవారు కాదు. అదేకాక, శ్రీరాములవారు ఆ సర్వేశ్వరుని ధ్యానించే అనేక
సందర్భాలూ రామాయణంలో లభిస్తాయి. శ్రీరామచంద్రుల వారి. బాల్యంలో వారి గురువుగారైన
శ్రీ విశ్వామిత్రుడు ఉదయ సంద్యావేళ
కౌసల్యా సుప్రజా రామ పూర్వసంద్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా
కర్తవ్యం దైవ మహనికం...
అనగా- 'కౌసల్యకు జన్మించిన బాలుడా! రామా! సూర్యోదయం వేళ అయి పోతుంది. త్వరగా నిదురలే,
నీవు మనుషులలో పులివంటి వాడివి. దైవారాధన చేయటం విధి...' అని మేల్కొలుపుతున్నారు. ఈ
సన్నివేశాన్ని బట్టి శ్రీరామచంద్రులవారు సర్వేశ్వరుని అవతారం కాదు, కాని ఆయన ప్రతినిధి
అయి ఉన్నారని స్పష్టం అవుతుంది.

అదేవిధంగా శ్రీకృష్ణులవారి ప్రబోధనలను గమనించినా ప్రస్తుతం చెలామణిలో ఉన్న అవతారవాదం
సమర్ధించబడటం లేదు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోక భాగాలను గమనించగలరు.

ఓ కృష్ణా! ఆ బ్రహ్మమేది? -8:1
పైన పేర్కొన్న శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణునికి అడిగిన ప్రశ్న 'ఆ సృష్టికర్త ఎవరు? అన్నది.
దానికి నేటి అవతార వాద భావన ప్రకారం అయితే శ్రీకృష్ణులవారి సమాధానం
'అదేమిటి అర్జునా! అలా ప్రశ్నిస్తున్నావు? నేనే కదా ఆ 'బ్రహ్మను' అని ఉండాలి. కాని ఆయన దానికి
భిన్నమైన సమాధానం ఇస్తున్నారు. అదేమిటో ఈ క్రింది శ్లోకభాగంలో గమనించగలరు.

అక్షరం బ్రహ్మ పరమం...
నాశరహితమైన సృష్టికర్త పరమందునున్నాడు... -8:3
సర్వేశ్వరుని ప్రత్యక్ష అవతారంగా భావించబడుతున్న శ్రీకృష్ణులవారు స్వయంగా ఇచ్చిన పై సమాధానాన్ని
బట్టి, నేటి జనసామాన్యంలోని సామాన్య అవతార భావనను గీతాశాస్త్రం సమ్మతించటం లేదని తెలుస్తుంది.
అదే ప్రకారంగా గీతాశాస్త్రంలోని ప్రతి అధ్యాయానికి చివర
ఇతి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే.
ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున
సంవాదము.

దీని ద్వారా తెలిసేదేమంటే- బ్రహ్మ అనగా ఆ సర్వేశ్వరుడు తన విద్యను అంటే జ్ఞానాన్ని లేక గీతాశాస్త్రాన్ని
శ్రీకృష్ణునికి మరియు అర్జునినికి మధ్య సంవాదం అనగా సంభాషణ (CONVERSATION) గా చేయించి,
మానవాళికి తను చెప్పదలచుకున్న ‘మంచి-చెడుల' మరియు 'చేయవలసిన-చేయకూడని' (DO'S AND
DON'TS) సమాచారాన్ని అందించాడు. దీని ప్రకారం అటు శ్రీకృష్ణుల వారు ఇటు అర్జునుల వారు
'పాత్రధారులు' మాత్రమేనని అర్థమవుతుంది. ఇంకా 'సూత్రధారుడు' మటుకు ఆ సర్వేశ్వరుడేనని కూడా
తెలుస్తుంది. దీనంతటిని బట్టి శ్రీకృష్ణుల వారు సర్వేశ్వరునికి అతీతమైన అస్తిత్వమే కాని ఆయన
అవతారం మాత్రం కాదని తేటతెల్లమవుతుంది. మరీ ముఖ్యంగా గీతాశాస్త్రంలో సర్వేశ్వరుడు తన నిర్దిష్ట
లక్షణాలు- ఒకటి 'అజం' అనగా జన్మరహితుడని రెండు 'అవ్యక్తం' అంటే కనిపించని వాడనని మరియు
మూడు 'అవ్యయం' లేక 'అవినాశి' అనగా మరణం లేనివాడినని తీర్మానపూర్వకంగా ప్రకటించి ఉన్నాడు.
మన గీతాశాస్త్రం ఈ తీర్మానాలను నేటికీ ఘోషిస్తూనే ఉంది. ఆ సర్వేశ్వరుడు ఒకవేళ ఏ ఒక్కసారైనా
మానవునిగా అవతారమెత్తి ఉంటే పైన చెప్పిన లక్షణాలన్ని ఒక్క పెట్టున కోల్పోతాడు. నిజంగా
రామావతారంగా ఆయన అవతరించి ఉంటే, తదుపరి గీతాశాస్త్రంలో పై మూడు లక్షణాలు కలవాడినని
ఆయన పేర్కొనకూడదు.... ఆయన పుట్టాడు కాబట్టి ఇక ఆయన జన్మరహితుడు అన్నది అసత్యం
అయిపోతుంది. అలాగే ఇతర రెండు లక్షణాల విషయం కూడా. గీతాశాస్త్రాన్ని కాస్త జాగ్రత్తగా అధ్యయనం
చేస్తే, ఆ సర్వేశ్వరుడు తన వద్ద ఉన్న పరమాత్ముడనే ఒక గొప్ప దేవతను దేవకీ, వసుదేవుల తనయుడైన
శ్రీకృష్ణుడి రూపంలో అర్జునుని వద్దకు పంపినట్లు అర్థమవుతుంది. సర్వేశ్వరుని మరొక ప్రత్యేకత 12:3వ శ్లోకం
ప్రకారం 'అచలం' అనగా 'చలించని వాడు కాబట్టి రావటం పోవటం వంటివి ఆయనకు అతీతమైన
విషయాలు. కారణం..? ఆయన లేని ప్రదేశం అంటూ ఉంటే కదా ఈ రావటం పోవటం అన్నవి జరగటానికి..
ఇక శ్రీకృష్ణులవారి చరిత్రను గమనించిన వారు కూడా తనకు అతీతమైన అస్తిత్వాన్ని ఆరాధించినట్లు,
ధ్యానించినట్లు, ఉపాసించినట్లు అనేక సన్నివేశాలు కనిపిస్తాయి. దీనిననుసరించి నేటి సామాన్య
అవతారవాదం శాస్త్రబద్ధం కాదని స్పష్టంగా ద్యోతక

2. సృష్టి- సృష్టికర్త ఒకే అస్తిత్వం,

ఇదెలాగంటే విభిన్న సృష్టితాలుగా కనిపిస్తున్న ఈ అనంతవిశ్వం యొక్క మూల పదార్థం అంటే,
మట్టి అనే ఒకే మూలపదార్థంతో విభిన్న పాత్రలు ఎలా చేయబడ్డాయో అలాగే సృష్టికర్త స్వయంగా
ఈ అనంతవిశ్వంలో కనిపిస్తున్న రూపాలను సంతరించుకున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే
దేవుడు స్వయంగా మల్లెలుగానూ ఉన్నాడు మరియు మట్టిగాకూడా అభివ్యక్తం అయివున్నాడు.
కాబట్టి ప్రతి వస్తువూ, ప్రతి పదార్థమూ సాక్ష్యాత్తు ఈశ్వరుడే అనే భావనకూడా సర్వత్రా ప్రబలి ఉంది.
ఈ దృక్పథం భౌతికశాస్త్రం పరంగానూ సమంజసం కాదు. ఎలాగంటే- మనముందు అనేక లోహాలు,
ద్రవాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగారం అనే లోహాన్ని తీసుకుంటే దానితో నిర్మించబడిన ప్రతి
వస్తువులోనూ సంపూర్ణంగా ఆ బంగారపు లక్షణాలే ఉండాలి. కాని ఇనుము, వెండి లేక ఏ ఇతర లోహపు
లక్షణాలుండటం అన్నది అసంభవం.

పై దృక్పథం ప్రకారం సాక్షాత్తు దైవపదార్థంతోనే ఈ సృష్టి నిర్మాణం జరిగిందన్నదే నిజమైతే- దుర్గందం,
వాడిపోవటం, శిథిలంకావటం, క్షీణించిపోవటం, నశించిపోవటం లాంటి దోషగుణాలు అవలక్షణాలు
సృష్టిరాశులలో మచ్చుకైనా ఉండకూడదు. ఎందుకంటే- సర్వేశ్వరుని అస్తిత్వం సంపూర్ణంగా పరిశుద్ధం,
సర్వదా సర్వోన్నతం, సర్వశ్రేష్ఠం. కాబట్టి. సర్వేశ్వరుని అస్తిత్వం అంధకారానికి అజ్ఞానానికి మరియు
ఒక్క మాటలో చెప్పాలంటే- సకల ప్రతికూల (NEGATIVE) గుణాలకు అతీతం. అలాగే ఆయన
సులక్షణాలను గురించి చెప్పాలంటే- సర్వ అనుకూల (POSITIVE) లక్షణాల సమాహారం. అలాంటి
అతి పరిశుద్ధుని అస్తిత్వమే కనుక కనిపిస్తున్న ఈ చర-అచర భువనభాండంగా రూపాంతరం
(TRANSFOMATION) చెంది ఉంటే అందులో నేడు అణువణువునా కనిపిస్తున్న లోపాలలోని కనీసం
అణుమాత్రమైన లోపమూ ఉండకూడదు. అంటే ఈ సృష్టి ఆద్యంతమూ సర్వశ్రేష్ఠత్వాన్ని మాత్రమే కలిగి
ఉండాలి. కాని ఈ సృష్టి అలా లేదుకదా! పోనీ సర్వేశ్వరుడు కూడా ఇలాంటి అవలక్షణాలతో ఉన్నాడని
అందామా? అలా అనటం కాదుకదా, కనీసం అలా ఊహించటం కూడా ఘోర అపచారం అవుతుంది.
సర్వేశ్వరుడు క్షమించుగాక.
ముఖ్యంగా 15:16-17 శ్లోకాల ప్రకారం సృష్టి 'పర-అపర' అనే రెండు పదార్థాలతో నిర్మితమైనదని గీతాశాస్త్రం
స్పష్టం చేసింది. అంతేకాదు సర్వేశ్వరుడిని ఈ పర అపర అస్తిత్వాలకు 'అతీతః' అనగా మించినవాడు అని
మరియు ఆ రెండిటికంటే 'ఉత్తమ' అంటే శ్రేష్ఠుడు అని గీతాశాస్త్రంలోని 15:18వ శ్లోకం ఎలుగెత్తి ప్రకటిస్తుంది.
దీని ననుసరించి రెండవ దృక్పథం కూడా గీతాశాస్త్రం ప్రకారం అసమంజసమైనదని తేట తెల్లమవుతుంది.

3. సృష్టికర్త, సృష్టి పదార్థములు మరియు ప్రాణులు అనాది.
ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఏవిధంగా సనాతనుడో, ఆది లేనివాడో అనగా
అనంతకాలం నుండి ఉన్నవాడో అదేవిధంగా సృష్టి పదార్థము మరియు ప్రాణులు అనగా ఆత్మలుకూడా
అనంతకాలం నుండి ఉన్నాయన్నది ఒక వాదన.

ఈ వాదన ప్రకారం సర్వేశ్వరునికి అతీతముగా మరో రెండు అస్తిత్వాలైన 'సృష్టి పదార్ధం' మరియు 'ఆత్మలు'
కూడా అనాదిగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ దృక్పథాన్ని |గీతాశాస్త్రం సమర్ధిస్తుందా? అన్న ప్రశ్నకు
సమాధానంగా ఈ క్రింది వ్యాఖ్యానాన్ని గమనించగలరు

సర్వేశ్వరుడు 'అహం సర్వస్వ ప్రభవః' అనగా నేనే సమస్తాన్ని సృష్టించాను. అన్న ఆయన ఈ ప్రకటనలోని
'సర్వస్య' అనే పదం పై దృక్పథాన్ని ఖండిస్తూంది. అదెలాగంటే అద్వితీయుడైన సర్వేశ్వరుడు తనకు
అతీతమైన సమస్తాన్నీ సర్వస్య అనే పదం సూచిస్తుంది. ఆ 'సర్వస్య'ను ఆయన ఏమి చేశాడు? 'ప్రభవః'
అంటే కలిగించాడు. లేక సమస్తానికి ఉనికిని ప్రసాదించాడు. సర్వేశ్వరుడే సమస్తాన్ని పుట్టించినప్పుడు
సృష్టి పదార్థం-ఆత్మలు ఈ 'సమస్తం' అన్నదాని పరిధికి అతీతం ఎలాగవుతాయి? ఒకవేళ నిజంగానే
సృష్టి పదార్థం-ఆత్మలు అనాదిగా ఉండి ఉంటే, 'అహం సర్వస్య ప్రభవః' అని సర్వేశ్వరుడు ప్రకటిస్తే
అది సత్యాదూరం అవుతుంది.

మరో కోణంలో కూడా పై వాదనను గీతాశాస్త్రం ఖండిస్తుంది. 7:7వ శ్లోకం ద్వారా 'మత్తః పరతరం
నాన్యత్కించిదస్తి ధనంజయ...' అనగా 'ఓ అర్జునా! నాకంటే వేరుగ మరొకటి ఏదియు లేనే లేదు' అని
సర్వేశ్వరుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఈ శ్లోకంలో అత్యంత గమనార్హమైన విషయం ఏదనగా-
నాకంటే 'అన్యత్' అనగా అదనంగా ‘న అస్తి' అంటే అస్తిత్వం లేదు. ఎంతలేదు? 'కించిత్' అనగా
అణుమాత్రంగానైనా లేనేలేదు అన్నది సర్వేశ్వరుని స్పష్టమైన ప్రకటన. సర్వసృష్టికర్త అయిన
సర్వేశ్వరునికి అతీతంగా కించిత్తు పదార్థం కూడా లేనప్పుడు, సృష్టి పదార్థం మరియు ఆత్మలు
అనాదిగా ఆయనతో ఉన్నాయని భావించటం శాస్త్ర సమ్మతం ఎలా అవుతుంది? కాబట్టి- 'పరా ప్రకృతి
అయిన ఆత్మలను అపరా ప్రకృతి అయిన సృష్టి పదార్థాన్ని సైతం సర్వేశ్వరుడే సృష్టించాడు.
ఇక ఆ రెండు మూల పదార్థాల ద్వారా ఈ చర-అచర జగత్తునంతటిని చేసి, వాటన్నిటికీ ఆయన
చక్రవర్తిగా ఉండి, పాలిస్తున్నాడు' అన్న విశ్వాసమే వైదికం శాస్త్ర సమ్మతం. కనుక అలాంటి విశ్వాసాన్నే
సర్వేశ్వరుని పట్ల ప్రతి భారతీయుడూ కలిగి ఉండాలి.

గమనిక: అవతార పురుషులుగా ఆరాధించబడుతున్న మహనీయులు వాస్తవానికి ఆ సర్వేశ్వరుని
'అస్తిత్వాన్ని' (PHYSICAL) కాక ఆయన 'స్వభావాన్ని' (NATURE) పుణికి పుచ్చుకుని పుట్టినవారు.
కాబట్టి నిజమైన ఆధ్యాత్మికుడు కాదలచిన వ్యక్తి ఆ ఏకైక సర్వేశ్వరునితో తన మనస్సును అనుసంధానం
చేస్తూ ఉండాలి. అదేధ్యానము. తద్వారా ఆత్మకు 'శాంతి' లభిస్తుంది. ఇంకా ఆ మహనీయుల 'స్వభావాన్ని'
(NATURE) ను పుణికి పుచ్చుకోవాలి. తద్వారా నడవడికలో 'నీతి' అంకురిస్తుంది.

సర్వేశ్వరుని శాస్త్రీయ దృక్పథం పట్ల నిర్లక్ష్యం, దాని చేదు పరిణామాలు - ఒక మచ్చుతునక

సృష్టి, స్థితి, లయలు అనే ఈ మూడు కర్మలను విభిన్న అస్తిత్వాలు నిర్వహిస్తూ ఉంటాయని నమ్మేవారు
చాలామంది ఉన్నారు. శైవులు మరియు వైష్ణవులు అనే రెండు విభిన్న వర్గాలు సైతం పై ఆలోచన
ఆధారంగానే ఏర్పడ్డాయి. ఈ వర్గాల మధ్య ఏర్పడిన వైరం, ఆ తరువాత వారి మధ్య జరిగిన రక్తపాతం
తాలూకు రక్తపు మరకలు చరిత్ర పుటలలో నేటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఒకే వర్గాన్ని సైతం
పరస్పరం విచ్ఛిన్నపరచి, ఘర్షింపజేసిన అంశం ఏమిటీ? అని ప్రశ్నిస్తే అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు
అనేవి ఒకే అస్తిత్వమైన ఒక్క సర్వేశ్వరుని గుణ కర్మల నామములనే యథార్థం తెలియక పోవడమే!
ఈ విషయం మన ధార్మికగ్రంథాల అవగాహన రాహిత్యానికి ఒక మచ్చుతున ఇది మన ధార్మికగ్రంథాలిచ్చే
సందేశంపట్ల మనం చూపుతున్న నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.

ఆ ఒక్క సర్వేశ్వరుడినే 'ప్రభవిష్ణువు' అని అంటారు. అనగా చరా- అచర విశ్వాన్నం తటినీ ఆయనే
సృష్టించాడు. ఆ ఒక్క సర్వేశ్వరుడినే 'భూతభర్త' అని అంటారు. 
ఎందుకంటే ఈ చరా-అచర సృష్టినంతటినీ పరిరక్షిస్తూ, పరిపోషిస్తున్నాడు కనుక. ఆ ఒక్క
సర్వేశ్వరుడినే 'గ్రసిష్ణువు' అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చరా- అచర జగత్తులో సంభవిస్తున్న,
సంభవించబోయే ప్రళయాలు ఆయన సంకల్పం ప్రకారం మాత్రమే జరుగుతాయి. ఆ వివరణను
గీతలోని 13:16 శ్లోకములో గమనించగలరు.
ఈ విషయం యొక్క అవగాహనా రాహిత్యం మొత్తం హిందూ జాతిని రెండు వైరి వర్గాలుగా చీల్చివేసింది.
నేటికీ ఈ తప్పుడు దృక్పథాలకు సంబంధించిన వైరం ఇరు వర్గాల మస్తిష్కాలలో ప్రచ్ఛన్నంగా నిలిచి
ఉంది. అజ్ఞానపూరితమైన ఈ దృక్పథాన్ని తొందరగా దూరం చేయకపోతే ఈ వర్గతత్వం ఏక్షణాన్నైనా
మరల భగ్గుమనే ప్రమాదం పొంచివుంది.


లాభ-నష్టాలకు మూలకర్త ఎవరు?

ఆ సృష్టికర్త ఈ యావత్ సృష్టిని ఒక్క మానవాళి కొరకు మాత్రమే సృష్టించాడు. ఇంకా ఈ సృష్టిలోని సకల
శక్తులను తన స్వాధీనంలో ఉంచుకుని తన కనుసన్నలలో పనిచేసే విధంగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.
ఇప్పుడు మీరే చెప్పండి? ఈ సకల శక్తులకు ఆ సర్వేశ్వరుని అనుమతి లేకుండా మనిషికి 'లాభం' కాని 'నష్టం'
కాని కలిగించే శక్తి ఉంటుందా? లేదు. మనిషికి ఎదురయ్యే లాభ-నష్టాలకు కారకుడు ఎవరు? ఈ క్రింది శ్లోకాల
ను గమనించగలరు.

బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము,
సుఖము, దుఃఖము, పుట్టుక, నాశనము, భయము, భయములేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి,
తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నా వలననే
కలుగుచున్నవి. -గీత 10:4-5

పైన పేర్కొన్న రెండు శ్లోకాలలో మొత్తం పదహారు అనుకూల గుణాలు మరియు నాలుగు
వ్యతిరేక గుణాలను సృష్టికర్త పేర్కొన్నాడు. ఇక్కడ అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే-
పరస్పర విరుద్ధలైన ఈ గుణములు (భావా:) 'నావలననే కలుగుచున్నవి!" (మత్తః ఏవ భవన్తి) అన్నది.

సృష్టికర్త ద్వారా అనుకూల భావాలు కలగాలి గాని ప్రతికూల భావాలు కలగటం ఏమిటి? అన్న ప్రశ్న
ఇక్కడ తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు నిర్దిష్ట సమాధానం దొరకనంతవరకు ముందుకు పోవటం సాధ్యం కాదు.
ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టాలంటే మనిషి జన్మకు మూలకారణం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి.
శాస్త్ర అధ్యయనం ద్వారా తెలిసేదేమిటంటే- ముండకోపనిషత్తు 1:2:12వ మంత్రం 'పరీక్షాలోకాన్' అంటుంది.
అంటే- మనిషికొరకు ఈ లోకము పరీక్ష అయి ఉన్నది. అనగా మనిషిని పరీక్షించటానికి దేవుడు ఈ లోకాన్ని
సృష్టించాడు అని తెలుస్తోంది. ఈ పరీక్ష వేటిలో జరుగుతోంది? అని ప్రశ్నిస్తే గీతా శాస్త్రం 8:26వ శ్లోకం
'శుక్లపక్షము' అనగా 'జ్ఞానమార్గము లేక మంచి మార్గము' మరియు 'కృష్ణపక్షము' అంటే 'అజ్ఞానమార్గము
లేక చెడుమార్గము' అనే ఉభయ మార్గాలు కలవని తెలుపుతోంది. దీనిని బట్టి ఈ రెండు మార్గాలలోని
ఏ మార్గాన్ని మానవుడు అనుసరిస్తాడన్నదే దేవుడు పెట్టిన పరీక్ష! ఇది మనిషి దైనందిన అనుభవం కూడా.


మనిషి జీవితపు ఈ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఈ 'మంచి-చెడు' స్థితులకు గురిచేసే పరిస్థితులను ఎవరు
కల్పించాలి? ఆ దేవుడే కల్పించాలి. ఆ విషయాన్నే 10:8వ శ్లోకంలో దేవుడు 'మత్తః సర్వం ప్రవర్తతే' అంటే
'నా వలననే సమస్తము కలుగుచున్నది' అని సెలవిస్తున్నాడు. 'సర్వం' అనగా మనిషి మస్తిష్కంలో
అకారణంగా ఏర్పడే 'మంచి-చెడు తలంపుల నుండి ఈ అనంత జగత్తులో సంభవించే 'అనుకూల
ప్రతికూలు పరిణామాలన్నీను. ఇంకా మానవాళి వ్యక్తిత్వాలలో సాధారణంగా ఏర్పడి ఉండే మౌలి
గుణములు మూడు. అవి: 'సత్వ, రజో మరియు తమో' గుణములు. ఇవి కూడా ఏకైక సర్వేశ్వరుని
ద్వారా మాత్రమే సంభవిస్తున్నాయని సెలవియ్యబడుతున్న మరో శ్లోకాన్ని గమనించగలరు.

సత్త్వరజస్తమోగుణములచే కలిగిన పదార్థములు లేక స్వభావములు) ఎవ్వి కలవో అవి నా వలననే
కలిగినవని నీ వెరుంగుము… -7:12

మరి అటువంటప్పుడు మనిషి చేసే సత్కార్యాలకు 'సత్కారం' అలాగే అతను చేసే దుష్కార్యాలకు
'దండనే' అతనికి ఎందుకు లభించాలి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం ఏమిటంటే
దైవం మనిషి మస్తిష్కంలో కలిగించేది మంచి-చెడు 'ప్రేరణలు' మాత్రమే. ఆ తరువాత దైవం మనిషికి
ప్రసాదించిన 'విచక్షణాజ్ఞానం' ద్వారా ఆ ప్రేరణలను మంచిని మంచి అని మరియు చెడును చెడు అని
విశ్లేషించుకుంటాడు. తరువాత దేవుడు ప్రసాదించిన రెండవ సామర్ధ్యమైన 'ఎంపిక స్వేచ్ఛ' ద్వారా
'మంచి తలంపు' ప్రకారం 'మంచి కర్మ'గా ఆచరణలో పెట్టటం లేక చెడు తలంపు'ను చెడు కర్మ'గా
ఆచరణలో పెట్టటం అన్నది పూర్తిగా మనిషి అభీష్టమే. అంటే మనిషి 'అభీష్టం లేకుండా దేవుడు
కలిగించిన మంచి-చెడు ప్రేరకాలు 'సాకారం' కాలేవన్నమాట. అందుకే మనిషి చేసే సత్కర్మలకు
'సత్ఫలితం' అలాగే మనిషి చేసే దుష్కర్మలకు 'దుష్ఫలితం' దేవుడు అతనికి ఇస్తున్నాడు.
ఇంతకూ అసలు విషయం ఏమిటంటే- మనిషికి సంభవిస్తున్న మంచి-చెడు స్థితులకు మూల కారకుడు
సృష్టికర్త ఒక్కడు మాత్రమే అన్నది. కాబట్టి సృష్టిలోని ఏ అస్తిత్వాన్నుండి 'ఆశించేది' ఏమీలేదు.
అదే ప్రకారం సృష్టిలోని దేనికీ 'భయపడేది' లేదు. ఈ 'ఆశా భయము'లను కేవలం ఒకే ఒక్క సర్వేశ్వరుని
పట్ల మాత్రమే కలిగి ఉండాలి. ఈ 'ఆకా భయముల మిశ్రమాన్నే దేవుని పట్ల విశ్వాసము' అని అంటారు.
ఎందుకంటే- 15:15వ శ్లోకం ప్రకారం. 'జ్ఞాపకశక్తి (స్మృతిః), జ్ఞానము (జ్ఞానమ్) మరియు మరపు (అపోహనం)
నావలననే కలుగుచున్నవి' అని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు ఆ సర్వేశ్వరుడు.
అదెలాగంటే- ఆదినుండి నేటి వరకు మానవాళికి ఉపయుక్తమైన ఎన్నెన్నో ఆవిష్కరణలు ఎందరెందరో
చేస్తూ వచ్చారు. వారికి వాటి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? ఆ సర్వేశ్వరుడే. ఒకవేళ ఈ ఆవిష్కరణల స్ఫూరణ
మనిషి అధీనంలో ఉండి ఉంటే ఈ నాటి ఆవిష్కరణలన్నిటినీ మనిషి ఏనాడో సాధించి ఉండాలి.
ఎందుకంటే- ఈనాడు ఏ సాంకేతిక పరికరాలను ఏ పదార్థాలతోనైతే మనిషి చేస్తున్నాడో అవన్నీ
ఏనాటి నుండో ఉన్నాయి. అత్యంత గమనార్హం ఏమిటంటే ఈ ఆవిష్కరణలు కూడా మానవాళి
వికాసానికి తగిన సమయం, సందర్భంలో సంభవిస్తున్నాయి. ఎలాగైతే- ఏ వయసులో ఏది
అవసరమో గుర్తించి ఒక తండ్రి తన సంతానానికి సమకూరుస్తూ ఉంటాడో అచ్చం అదే విధంగా
విశ్వమానవాళి అవసరాలకు అనుగుణంగా ఈ ఆవిష్కరణలు అందుతూ పోతున్నాయి.
ఒక వ్యక్తికి ఎన్నెన్నో విషయాల అవగాహన ఉంటుంది. కాని వాటి స్ఫురణ సందర్భోచితంగా
కలగకపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి సందర్భోచిత స్ఫురణనే మనం సమయస్ఫూర్తి
అని అంటాము. ఇది కూడా ఆ సర్వేశ్వరుని అనుగ్రహమే. మరికొన్ని సందర్భాలలో కొన్ని
విషయాలను మరచిపోతుంటాము. ఎంత గింజుకున్నా వాటిని జ్ఞప్తికి తెచ్చుకోలేము. ఇదికూడా
ఆయన మహిమే. పై మూడు విధాల పరిస్థితులను ఆ సర్వేశ్వరుడే కలిగిస్తూ ఉంటాడు.
ఇది మనిషిపై ఆయనకు గల అధికారం. దానిని ఎవరూ ఛాలెంజ్ చేయలేరు.
అయితే కొన్ని సందర్భాలలో జ్ఞాపకం రావటం మరికొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు
మరచిపోవటం మేలు అవుతూ ఉంటుంది. ఏది ఎప్పుడు లాభదాయకం అన్నది మనిషి
స్వయంగా గుర్తించలేదు. అలాంటి సందర్భంలో తనపట్ల అనుకూలంగా ఉన్నప్పుడు
ఆ సర్వేశ్వరుడు స్వయంగా అవసరం ఉన్నవాటిని మనిషి జ్ఞాన పథంలోనికి తెస్తాడు.
అవసరం లేనివాటిని మరిపింపజేస్తాడు. అలాగే తనపట్ల వ్యతిరేకత కలిగి ఉన్నవానికి
అతనికి అవసరం ఉన్న విషయాలను మరపింపజేస్తాడు. అతనికి అవసరంలేని విషయాలను
జ్ఞప్తిలోనికి తెస్తుంటాడు. కాబట్టి ప్రతివ్యక్తి ఆ సర్వేశ్వరుని పట్ల వ్యతిరేకతను విడనాడి, అతని పట్ల
అనుకూల సంబంధాన్ని మాత్రమే కలిగి ఉండటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి.


సారాంశం
సర్వేశ్వరుడు ఒక్కడే ఈ 'జగత్తు అంతటి'లోకెల్లా సర్వోన్నతుడు (SUPREME BEING) మనిషి ఒక్కడే
ఈ 'సృష్టితాలన్నిటి'లోకెల్లా సర్వోన్నతుడు (SUPREME BEING) మిగతా సృష్టితాలన్నీ ఈ మనిషికి
బానిసలు, సేవకులు (SERVANTS) అయితే మనిషి సేవకులైన ఈ సృష్టితాలన్నీ కేవలం ఆ ఒక్క
సర్వేశ్వరుని ఆజ్ఞలకు మాత్రమే స్పందిస్తాయి. కనుక మనిషి రెండు కారణాలచేత వాటిపట్ల 'ఆశ కలిగి
ఉండకూడదు మరియు 'భయము' కూడా కలిగి ఉండకూడదు. 

1. సృష్టితాలను అర్థించటం చెవిటివాని ముందు శంఖం ఊదటమే. ఎందుకంటే- శివుని ఆజ్ఞ లేనిదే
చీమైనా కుట్టదు అన్నది యథార్థం కాబట్టి.
2. సకల సృష్టితాలు మనిషికి సేవకులు, బానిసలు. అలాంటి వాటిని అర్థించటం అన్నది సృష్టికే
మకుటాయమానమైన మనిషి ఔన్నత్యానికి భంగకరం, అవమానకరం.
శ్రీరామ-కృష్ణాదులు మొదలు సకల రుషులు, మునులు తమకు కలిగిన కష్ట-నష్టాలను ఆపదలను,
బాధలను తొలగించమని కేవలం ఆ ఏకైక సర్వేశ్వరుడిని మాత్రమే పిలిచారు-కొలిచారు. ఆ ఒక్కడినే
ఆపద్బాంధవునిగా గుర్తించారు ప్రతిష్ఠించారు. సృష్టితాల ముందు వారు ఏనాడు తల వంచనూ లేదు.
చేయి చాచనూ లేదు. వాటిని అర్థించనూ లేదు ప్రార్థించనూ లేదు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం
అందుకే ఏ జంతువూ మరో జంతువును అర్ధించదు ప్రార్థించదు. ఏ సృష్టిరాశీ తోటి సృష్టిరాశికి దాసోహం
అవ్వదు. ఈ ప్రాకృతిక ధర్మాన్ని మన భారతీయ తాత్వికులు ఆదిలోనే గుర్తించారు. అందుకే వారు సృష్టిని
కాక సృష్టికర్తనే ప్రత్యక్షంగా ఆరాధించి తరించారు. తమ జన్మను సార్థకం చేసుకొని, ధన్య జీవులయ్యారు.
మానవ జన్మకు అంతిమ లక్ష్యమైన ముక్తిని సాధించారు. ఆ మహనీయుల ఆదర్శమే నేడు ప్రతి
భారతీయునికీ శిరోధార్యం కావాలి. ఇదే భారతీయ తాత్విక సారాంశం.

మనిషికి లాభ-నష్టాలు ఎందుకు కలుగుతాయి?
మనిషి జీవితం లాభ-నష్టాల సంగమం. అయితే ఈ లాభ-నష్టాలు అతనికి ఎందుకు కలుగుతాయి?
వాటికి గల మూల హేతువు ఏమిటి? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం. తెలియక పోవటం కూడా
మనిషిని అశాంతికి గురిచేస్తుంది. దానికి మౌలికంగా రెండు కారణాలు ఉన్నాయి.
1. మీరు ఎవరికైనా లాభం చేస్తే దానికి ప్రతిగా సర్వేశ్వరుడు మీకూ లాభం కలిగిస్తాడు. అదే విధంగా మీరు
ఎవరికైనా నష్టం తలపెడితే సర్వేశ్వరుడు మీకూ నష్టం సంభవింప జేస్తాడు.
2. ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని పరీక్షించటానికి లాభ-నష్టాలకు గురిచేస్తుంటాడు. 
పై రెండు కారణాలలో మొదటి కారణం సమంజసంగానే ఉంది. కాని రెండవ విషయంలోని మర్మం ఏమిటి?
అన్న సందేహం కలుగుతుంది. అది నివృత్తి కావాలంటే గతపుటల్లో పేర్కొన్న మానవజీవిత లక్ష్యాన్ని
జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సర్వేశ్వరుడు మనిషిని పరీక్షించటానికి పుట్టించాడు. ఆ పరీక్ష మంచి-చెడుల
మధ్య లేక లాభ-నష్టాల మధ్య అన్నది తెలుసుకొని ఉన్నాము. కాబట్టి ఈ లాభ-నష్టాలకు మనిషిని గురి
చేయటం అనివార్యం. 'లాభం కలిగినప్పుడు దానిని తాను అనుభవిస్తూ, అందులో తన చుట్టూ ఉన్నవారికి
పంచుతాడా? లేదా? అన్నది పరీక్ష, ఇంకా ఈ లాభం నాకు కలగటానికి నా కృషి మాత్రమేకాదు,
నా సర్వేశ్వరుని అనుగ్రహం అని నిరహంకారంగా ఉంటాడా? లేదా? అన్నది పరీక్ష. అదే ప్రకారం
'నష్టం సంభవించినప్పుడు సహనం వహిస్తాడా? లేదా? అన్నది పరీక్ష. ఇంకా ఆ నష్టాన్ని చూచి
నిరాశా నిస్పృహలకు లోనై సర్వేశ్వరుని పట్ల కోపతాపాలను పెంచుకొని చతికిల పడిపోతాడా లేక
జవసత్వాలను కూడదీసుకొని తిరిగి లాభం వైపునకు నడుస్తాడా? లేదా? అన్నది పరీక్ష. ఇదే మనిషి
జీవితంలో సంభవించే లాభ-నష్టాల పరమార్థం.

కనుక ఎవరెవరివలన ఏదైనా లాభం కలుగుతుందేమోనని ఆతృత పడి ఆందోళనకు గురి కావలసిన
అవసరం లేదు. కేవలం 'ఒక్క సర్వేశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఎవరివలన ఏదైనా
నష్టాలు సంభవిస్తాయోమోనని కంగారు పడి భయానికి లోను కావలసిన అవసరమూ లేదు. కేవలం
'ఒక్క సర్వేశ్వరుని అప్రసన్నతకు' దూరంగా మెలిగితే సరిపోతుంది. చూడండి దాని వలన మనిషికి
కలిగే అనేకానేక చిక్కులు తొలగి, ఎంతటి మనఃశాంతి లభిస్తుందో!
సర్వశక్తులపై సర్వాధికారం కలిగి ఉన్న ఆ ఒక్క సర్వేశ్వరుని 'ప్రసన్నత'ను పొందే 'అనుకూల విధానాన్ని
మనిషి స్వీకరించి ఆచరించాలి. ఆయన 'ఆగ్రహానికి గురిచేసే 'వ్యతిరేక మార్గాన్ని' విడిచిపెట్టాలి.
ఎందుకంటే ఆయన 'అనుగ్రహానికి పాత్రులైతే' సకలశక్తులూ మనిషికి 'అనుకూలం'గా పనిచేస్తాయి.
ఒక వేళ ఆయన 'ఆగ్రహానికి లోనైతే' అవే శక్తులు మనిషికి 'ప్రతికూలం'గా స్పందించి అతనిని నాశనం
చేస్తాయి. కనుక ఒకే ఒక్క సర్వేశ్వరుని ప్రసన్నత కొరకు తాపత్రయ పడితే సరిపోతుంది. ఆహా! ఈమాట
వింటేనే ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక, ఆచరణలో పెడితే ఇంకా ఎంతటి
శాంతి లభిస్తుందో కదా! ఈ విధంగా ఆ ఒక్క సర్వేశ్వరుడిని మాత్రమే. మహేశ్వరుడిగా తెలుసుకుంటే
శాంతి తప్పకుండా లభిస్తుంది.

సమస్త ప్రాణులకు ఆత్మీయుడు. ఒకవ్యక్తి తన చుట్టూ ఉన్న ఆయా వ్యక్తులను చూచినప్పుడు వారిలోని
ప్రతి ఒక్కడూ వ్యక్తిగత ప్రయోజనమే పరమార్థంగా పెట్టుకుని తన తోటివారితో వ్యవహారాలు సాగిస్తున్న
వైనం స్పష్టంగా కనిపిస్తుంది.
ఉదాహరణకు ఆయా జాతులమధ్య, వివిధ వర్గాల మధ్య, నాయకులు అనుచరులు మధ్య అధికారులు
అనుయాయుల మధ్య, యాజమాన్యం కార్మికుల మధ్య, ఇరుగు పొరుగువారి మధ్య, వ్యాపారులు
వినియోగదారుల మధ్య, తోటి స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, చివరికి తల్లిదండ్రులు
సంతానం మధ్య ఒకరి పట్ల ఒకరు అభద్రతా భావానికి లోనయి ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే
ఒకటి మానవుడు సహజంగా ఏదోలోటు కలిగి ఉంటాడు. రెండవది ఆ లోటును మరొకరిద్వారా
పూరించుకుంటేనేకాని తీరదు. ఇది ప్రకృతి సిద్ధమైన తప్పనిసరి పరిస్థితి. తనకున్న ఈ లోటును
తన తోటివాడు తీరుస్తాడా? లేదా? అన్నదే ప్రతి ఒక్కడి మదిలోని బెంగ. ఈ బెంగే మనిషి
అంతరంగంలో అశాంతికి బీజం వేస్తుంది.
మనిషి అంతరంగంలోని అశాంతికి కారణమైన అతని మదిలోని ఈ బెంగ తొలగనిదే ఏ
మనిషికీ మనశ్శాంతి సంప్రాప్తం కాజాలదు. దానికి ఈ క్రింది లక్షణాలు కలిగి ఉన్న వాడు
ఒకడు మనిషికి స్నేహితుడుగా ఉండాలి.
ఆ స్నేహితుడు తనకు స్వతఃగా ఎలాంటి అక్కరలు, అవసరాలు లేనివాడై ఉండాలి.
ఇంకా తను చేసిన మేలుకు ఎదుటివారినుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించనివాడై ఉండాలి.
అంటే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఏకపక్షంగా ఎదుటివానికి సకలవిధాలా సహకరించడమే
ధ్యేయంగా పెట్టుకున్నవాడై ఉండాలి. అలాంటివాడు ఎవడైనా ఉన్నాడా? అని గీతాశాస్త్రాన్ని
ప్రశ్నిస్తే ఈ క్రింది విధంగా సమాధానం లభిస్తుంది. 
నమే పార్ధస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి -3:22

అర్జునా! నా కీ మూడులోకములందును చేయదగిన కార్యమేదియును లేదు. మరియు పొందబడనిదియు,
పొందదగినదియునగు వస్తువున్ను ఏదియూ లేదు. అయినను నేను కర్మయోగమందు ప్రవర్తించుచునే
యున్నాను.
సర్వేశ్వరుడు తను ఎలాంటివాడో ఈ శ్లోకంలో స్వయంగా తెలియజేస్తున్నాడు. అది: ముల్లోకములు
అనగా స్వర్గ, మర్త్య అంటే ప్రంపంచం మరియు పాతాళ లోకములు. ఈ మూడు లోకములలో ఏ
పనులైతే సర్వేశ్వరుని ద్వారా సంభవిస్తున్నాయో వాటిని ఆయన తన కోసం చేయటం లేదు. వాటి
అవసరాలను తీర్చడానికే ఆయన ఇదంతా చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు
తన కోసం చేసుకోవలసిందంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఆయనకు లేనిదంటూ ఏదీలేదు కనుక.
ఎవరికో ఏదో చేసి ఆయన తన కోసం పొందవలసిందీ ఏదీలేదు. కారణం సర్వేశ్వరుడు శక్తి
సామర్థ్యాలపరంగా పరిపూర్ణుడు ఆయన సకల శక్తులకంటే సర్వోన్నతుడైన శక్తిమంతుడు. ఇంకా
ఆయనే సమస్త శక్తులకు శక్తి ప్రదాత. అందుకే ఆయన నిరపేక్షాపరుడు అయ్యాడు.
అయినప్పటికీ సర్వేశ్వరుడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి 'పరమాత్మ'ను ఈ లోకానికి పంపించి,
తద్వారా 'దుష్టుల'ను అంతమొందించటం మరియు 'శిష్టుల'ను రక్షించటం లాంటి కర్మలను
ఎందుకు నిర్వహింపజేశాడు? ప్రస్తుతం మానవాళికి మేలు చేసే ఎన్నో కర్మలను ఆచరిస్తూనే ఉన్నాడు.
ఇదంతా ఆయనకు ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానంగా క్రింది శ్లోకాన్ని
గమనించగలరు.
ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహమ్
సంకరస్య చ కర్తాస్యాముపహన్యామిమాః ప్రజాః -3:24

మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంఘమునందేర్పడు
సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును.
సర్వేశ్వరుడు ఎవరి అక్కరా అవసరము లేని వాడైనప్పటికీ పై కర్మలను ఎందుకు నిర్వహింపజేస్తున్నాడో,
దాని మౌలిక ఉద్దేశము ఏమిటో కూడా పై శ్లోకములో స్పష్ట పరుస్తున్నాడు. ప్రజలను చెడిపోకుండా
కాపాడడానికి, వారి మార్గభ్రష్టత్వానికి తను కారకుడు కాకుండా ఉండాలన్నది సృష్టికర్త ఉద్దేశ్యం.
సర్వేశ్వరుడు తను కేవలం తన దాసుల ప్రయోజనార్థం మాత్రమే కర్మ చేస్తున్నాడని ఈ శ్లోకం ద్వారా
స్వయంగా స్పష్టపరుస్తున్నాడు. ఈ ప్రకారంగా సర్వేశ్వరుడు మానవులనుండి ఎలాంటి ఫలితాన్ని
ఆశించకుండా సమస్తాన్నీ ప్రసాదించడమే కాక వారి ఇహపరాల సాఫల్యానికి కావలసిన ధర్మాన్ని
కూడా నేడు అనేకులద్వారా తెలియజేస్తున్నాడు. అలాంటి నిరపేక్షాపరుడు | మానవునికి హితైషిగా
ఉంటానంటున్నాడు. సర్వశక్తిమంతుడు అయిన దైవం అవమిత్రుడు మరియు స్నేహితుడు
అయితే అతని మదిలోని బెంగ కాస్త మటుమాయమవుతుంది. ఇంకా అంతటి శక్తిమాన్యుడిని
తన స్నేహితుడిగా పొందిన వ్యక్తి హృదయంలో ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం
మరియు శాంతే శాంతి పరవళ్లు తొక్కుతుంది. ఈ విధంగా సృష్టికర్తను తెలుసుకుంటే మనిషికి
ప్రశాంతత లభిస్తుంది. అంటే మనం 'ఒక్క సృష్టికర్తకు అనుకూలంగా మారిపోతే' మన చుట్టుతా
ఉన్న ప్రకృతి శక్తులన్నీ 'మనకు అనుకూలంగా మారిపోతాయి'. 'ఆయన ఒక్కనికి వ్యతిరేకంగా
ప్రవర్తిస్తే' మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతే 'మనకు వ్యతిరేకం అయిపోతుంది'.

అనుకూల మరియు వ్యతిరేక ప్రవృత్తులంటే..? వ్యక్తిగత జీవనంలో తనకు మరియు
సామూహిక జీవనంలో ఇతరులకు లాభం కలిగేలా మెలగటాన్నే అనుకూల ప్రవృత్తి అంటారు.
దానికి వ్యతిరేకంగా తనకు, తన తోటివారికి నష్టం సంభవించేలా ప్రవర్తించటాన్నే వ్యతిరేక ప్రవృత్తి
అంటారు. ఆ లాభ నష్టాలు ఏ రూపంలో, ఏ స్థాయిలో సంభవించినప్పటికీనూ. ఇక ఏది లాభదాయకం
మరియు ఏది నష్టదాయకం అన్నది కనీస బుద్ధి (COMMON SENSE) గల ప్రతివ్యక్తీ గుర్తించగలడు.
తరువాత ఆ మంచి-చెడుల స్పృహ, స్పృహలో ఉన్నంతవరకూ ఎవరికీ 
ఎలాంటి లాభంగాని నష్టంగాని సంభవించదు. అది కాస్త కార్యరూపం దాల్చినప్పుడే తనకుగాని,
ఇతరులకుగాని లాభ-నష్టాలు కలిగిస్తుంది.
అయితే మనిషి మస్తిష్కంలోని మంచి-చెడు ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ఒక్క
స్వీయ ఇచ్ఛ తప్ప మరొకనికి ఏ మాత్రం ప్రమేయం ఉండదు. ప్రతి మనిషికీ మంచి-చెడుల
స్పృహ కలిగించేది ఆ సృష్టికర్తే. ఆ మంచి-చెడుల విస్పష్ట వివరాలతో ఆ సృష్టికర్త స్వయంగా
ఎన్నో గ్రంథాలను కూడా అవతరింపజేశాడు. వాటినే ధార్మిక పరిభాషలో ధర్మశాస్త్రాలు అని అంటారు.
ఈ ధర్మశాస్త్రాల అవతరణ అన్నది సృష్టికర్త మనిషికి చేసిన అదనపు మేలు.
మనిషికి మంచి-చెడుల స్పష్టమైన స్పృహ ఉన్నప్పటికీ ఈ ధర్మశాస్త్రాలను పంపించటానికి గల మౌలిక
కారణం ఏమిటంటే మనిషికి ఉన్న స్వార్థపూరిత ప్రయోజనాలకొరకు లేక అజ్ఞానం కారణంగా ఆ స్పృహ
కాస్తా కప్పబడిపోతూ ఉంటుంది. అందుకే సర్వేశ్వరుడు పంపించిన విధి నిషేధాల మాలిక అయిన
ధర్మశాస్త్రాన్ని అనుసరించి కర్మ చేస్తూ ఉండాలి. అంటే- ధర్మశాస్త్రాలు అనుమతిస్తున్న విధులను
ఆచరిస్తూ ఉండటం మరియు ఆ ధర్మశాస్త్రాలు వారిస్తున్న నిషేధితాలకు దూరంగా మెలగటాన్నే
అనుకూల ప్రవృత్తి అని అంటారు. దానికి భిన్నమైన వైఖరినే వ్యతిరేక ప్రవృత్తి అని పేర్కొంటారు.

మానవులలోని ఒక చిన్న అధికారితో మైత్రి కష్టసాధ్యమైనప్పుడు సర్వేశ్వరునితో సాధ్యమా?
మానవుడు కలిగి ఉన్న 'ఐశ్వర్యము, ఆయుష్షు' ఎంతో పరిమితమైనవి. పైగా అవి ఒకానొకరోజు
అంతమైపోయేవే. ఇంతటి అల్పమైన ఐశ్వర్యాన్ని, ఆయుష్షును పొంది . ఉన్న ఈ మానవుడు
కాస్తంత అధికారం లభిస్తే తనతోటివారి పట్ల ఎంతో అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శిస్తుంటాడు.
వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఇది మనిషి సహజ స్వభావము. ఇంకా ఈ అనంత సృష్టిలో మానవుని
స్థానం కనీసం ధూళిరేణువంత కూడా కాదు.
అంతటి అత్యల్పుడైన మానవుడే తన తోటివారి పట్ల ఇంతటి అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటే
ఈశ్వరులకే ఈశ్వరుడైన ఆ మహేశ్వరుడు ఇంకెంతటి అహంకారాన్ని కలిగి ఉంటాడో, అల్బుతైన ఈ
మానవుని పట్ల ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాడో అనే సందేహం ఒక వైపు కలుగుతుంది. మరోవైపు
ఆయన మనిషిపట్ల ''ఆత్మీయునిగా ఉంటానంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? దానికి కారణం ఏమిటి?
అని ప్రశ్నిస్తే, సమాధానంగా ఆయన స్వభావాన్ని, సామర్థ్యాలను మననం చేసుకోవాలి. అలాగే
మనిషిలోని బలాలు-బలహీనతలయథార్ధాన్నికూడా కాస్తంత గమనించాలి. మానవుని స్వభావంలో
అనుకూల మరియు ప్రతికూల గుణాలు మిశ్రమంగా వున్నాయి. ఇంకా ఆ అనుకూల గుణాలు కూడా
అపరిపూర్ణంగా ఉన్నాయి. దీనికి భిన్నంగా ఆ సర్వేశ్వరుని స్వభావం కోమలంగానూ, నిర్మలంగాను
ఉండటానికి కారణం ఆయనలోని అనుకూల గుణాలన్నీ పరిపూర్ణం కావటం ఒకటి, రెండవది
ఆయనలో ప్రతికూల లేక వికారగుణాలు మచ్చుకైనా లేక పోవడం. ఇది సర్వేశ్వరుని స్వభావం.
ఈ కారణంగానే సర్వేశ్వరుడు మానవుని పట్ల అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం లేదు.
సర్వేశ్వరుడు తన 'స్వభావాన్ని' తన 'పాలసీని' స్పష్టపరుస్తున్న వైనాన్ని గమనించగలరు.

సమ్మోహం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తిన ప్రియః
యే భజన్తితు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్. -9:29
నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింప దగిన వాడుగాని,
మరియొకడు ఇష్టుడుగాని ఎవడును లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నాయందును,
నేను వారియందును ఉందుము.
పై శ్లోకములో మూడు గమనార్హమైన విషయాలు ఉన్నాయి. అవి: ఒకటి సమస్త ప్రాణులయందు
'సమభావం'గా ఉండే 'స్వభావం' సర్వేశ్వరుడు కలిగి ఉండటం. అంటే రంగు, వర్ణం, ప్రాంతం, కులం,
మతం ఆధారంగా ఒకడు గొప్పవాడని మరొకడు తక్కువవాడని ఎవనిని ఎంచడు. అందరిపట్ల ఆ
సర్వేశ్వరుడు తటస్థంగా ఉంటాడని అర్ధం అవుతుంది. రెండవది ఆయన విధానం ఏమిటంటే 'భక్తి'తో
ఎవడు తనను సేవిస్తారో అలాంటివాని 'పక్షం'లో ఉండటం, అంటే భక్తితో తనను సేవించేవారే తనవారు,
అలాగే తనూ ఆ భక్తిపరులకే చెంది ఉంటాను అంటున్నాడు సర్వేశ్వరుడు. మూడవది భక్తితో తనను
సేవించనివారితో నాకుగాని, నాతో వారికిగాని ఎలాంటి సంబంధమూ ఉండదు అని సర్వేశ్వరుడు
చెప్పకనే చెబుతున్నాడు. కనుక ఆ సర్వలోక మహేశ్వరునితో మైత్రిని ఆత్మీయతను సంపాదించు
కొనాలనుకొనేవారు 'భక్తి' మరియు 'సేవనం' లేక 'భజించటం' అనే మార్గాలను అనుసరించాలని
ఆయనే స్వయంగా తెలుపుతున్నాడు.

భక్తితో భజించటం ఎలా ?
ఒక వ్యక్తి తన యజమాని ఆదేశాన్ని రెండు విధాలుగా ఆచరిస్తాడు. ఒకడు- "ఇది నా స్వామి ఆదేశం
కాబట్టి ఆచరిస్తున్నాను. నాకైతే ఇష్టంలేదు." అనే విధంగా కర్మను ఆచరిస్తాడు. మరొకడు- "ఇది నా స్వామి
ఆదేశం. ఆయన ఏది ఆదేశిస్తే అదే నాకు శిరోధార్యము." అని హృదయపూర్వకముగా కర్మను ఆచరిస్తాడు.
అతని ఈ సహృదయతకు మూలకారణం సర్వేశ్వరుడు ఇచ్చే ఆజ్ఞల పరమార్థం మనిషి వ్యక్తిగత
ప్రయోజనార్థమే అని గుర్తెరగటం. అందుకే అతడు -"నా సర్వేశ్వరుడు ఇస్తున్న ఈ ఆజ్ఞలలో ఆయన
స్వార్థం ఏమిలేదు గదా! ఈ ఆజ్ఞలను పాటించడం ద్వారా నాకే మేలు కలుగుతుంది. వాటిని పెడచెవిన
పెడితే నష్టపోయేదీ నేనే కదా!" అన్న వాస్తవాన్ని గుర్తించి ప్రీతి పూర్వకంగా సహృదయంతో
సర్వేశ్వరుని ఆజ్ఞను ఆచరిస్తాడు. ఇలాంటి మానసిక స్పందననే 'భక్తి' అని అంటారు. ఇంకా
భయముతో కూడిన స్నేహము అనే అర్థం వస్తుంది. తరువాత భక్తి అనగా ఏకమై ఉండటం.
అంటే సృష్టికర్త ఇష్టాన్ని అనుసరిస్తూ ఆయనను అంటిపెట్టుకుని ఉండటం. విభక్తి అనగా విడదీయటం.
అంటే సృష్టికర్త ఆదేశాలకు వ్యతిరేకంగా నడుస్తూ, ఆయన నిరసనకుగురై దూరం కావటం.
ఇక 'భజించుట' లేక 'సేవనం' అంటే ఏమిటో గమనించగలరు. సర్వేశ్వరుడిని సర్వోన్నతునిగా గుర్తించి,
ఆయన గుణకర్మనామములను స్మరించటం. ఆయన ఘనమైన కార్యాలను ప్రస్తావించుకోవడం.
ఆయన ఔన్నత్యాన్ని పరాకాష్ఠ స్థాయిలో గాన కీర్తనల ద్వారా ఆలాపించటం. ఆయన గురించి తెలియని
వారికి ఆయనను పరిచయం చేయటం. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఆయన
'విధించిన వాటిని ఖచ్చితంగా పాటించటం. దానిద్వారా ఎంతటి 'నష్టం వాటిల్లే ప్రమాదం
కనిపిస్తున్నప్పటికీ, ఆయన 'నిషేధించిన దాని జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండటం, దానిని
చేయడంద్వారా ఎంతటి 'లాభం' కలిగే అవకాశం కనిపిస్తున్నప్పటికీ, ఈ విధమైన ఆచరణాత్మక
శారీరక కర్మలనే 'భజించుట' లేక 'సేవనం' అని అంటారు.
ఈ విధంగా ఆచరిస్తే శాంతి నిజంగానే లభిస్తుందా ?
నేడు మనఃశ్శాంతిని సాధించడానికి విశ్వవ్యాప్తంగా ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దానికోసం ఎన్నో ఆధునిక విధానాలు కూడా అవలంబించ బడుతున్నాయి. అయినప్పటికీ అశాంతి
తగ్గటం అటుంచి 'ఇంతింతయి వటుడింతయి' అన్నట్టు ఈ అశాంతి పూర్తి ప్రపంచాన్ని తన
కరకుబాహువులలోకి తీసుకుంటూ పోతుంది.
పైగా సమాజంలో కరుడుగట్టిన దుర్మార్గులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ కఠినాత్ములు అసలు
మారే అవకాశం ఉందా? అని ఎంతో నిరాశతో పెదవి విరుస్తూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి
తరుణంలో ఈ ఘోర సమస్య నిజంగానే పరిష్కారం అవుతుందా? అనే ధర్మసందేహం ఎవరికైనా
కలుగక మానదు. ఇంకా ఈ సమస్యలు అసలు ఎంత కాలానికి పరిష్కారం అవుతాయి? అనే సందేహం
కూడా కలుగుతుంది. ఈ మూడు సందేహాలకు గీతాశాస్త్రం ఏ విధంగా సమాధానం ఇస్తుందో గమనించండి.
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి
-4:36
(ఒకవేళ) పాపాత్ములకంటెను నీవు మిగుల పాపము చేసినవాడవైతివేని, ఆ
సమస్త పాపసముద్రమును జ్ఞానమను తెప్పచేతనే లెస్సగా దాటివేయ గలవు.
కరుడుగట్టిన దుర్మార్గులు అసలు మారుతారా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నవారికి ఈ పై శ్లోకం
ద్వారా సమాధానం దొరుకుతుంది. శ్లోకములో 'పాపకృత్తమః' అనే సమాసం ఘోరాతి ఘోరమైన
పాపాత్ముడిని సూచిస్తుంది. అంతటి కఠోరపాపి అయినప్పటికీ 'ఆత్మజ్ఞానము' (సృష్టికర్త యొక్క అస్తిత్వము,
గుణలక్షణాలు మరియు ఆయన ఆదేశాల అవగాహన ద్వారా ఉత్తముడుగాను, పుణ్యాత్ముడుగానూ
మారిపోగలడని స్పష్టమవు తుంది. ఇదే విషయం 9:30వ శ్లోకంలోనూ గమనించగలరు. అశాంతి అనే
ఈ ఘోర  సమస్య పరిష్కారం అవుతుందా? అని నిట్టూర్పును విడిచేవారికి మరియు ఈ సమస్య ఎంత
కాలానికి పరిష్కారం అవుతుందోనని ఆందోళన పడేవారికి ఈ క్రింది శ్లోకం ఎలాంటి సమాధానం
ఇస్తున్నదో గమనించండి.
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాప్తం నిగచ్ఛతి కొత్తేయ ప్రతిజానీహి న మే భర్తః ప్రణశ్యతి. -9:31
అతడు (సృష్టికర్తను గూర్చిన జ్ఞానం కలిగిన ఘోరపాపి) శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు.
మరియు శాశ్వతమయిన శాంతిని పొందుచున్నాడు. ఓ అర్జునా! 'నాభక్తుడు చెడడు' అని ప్రతిజ్ఞచేయుము.

ఈ శ్లోకము సంస్కర్తల నిరాశను పటాపంచలు చేస్తుంది. ఇందులోని గమనార్హమైన విషయాలు
ఏమిటంటే మొదటిది ఎంతటి దుర్మార్గుడైనా ఉత్తముడై తీరుతాడని అర్థం అవుతుంది. రెండవది
ఆ మారటంకూడా ఎప్పటికోకాదు, ఏనాటికో కాదు. 'క్షిప్రం' అనగా 'శీఘ్రము'గా అంటే త్వరగా మారిపోతాడు.
ఈ పరివర్తన అనంతరం అతడు పొందబోయే శాంతి ఏదో కొన్ని దినాలో, కొన్ని సంవత్సరాలో కాదు.
'శాశ్వతమైన శాంతి' అనగా ఈ జీవితాంతమే కాక మరణానంతర జీవితంలో కూడా ఈ ప్రశాంతతను
అతడు కలిగి ఉంటాడు. అంటే పరలోకంలో ముక్తిని సాధించి స్వర్గాన్ని పొందుతాడు. మూడో విషయం
ఏమిటంటే ఆ సర్వేశ్వరుని అస్తిత్వజ్ఞానం పొంది శాంతిని సాధించినవాడు. ఇక ఏనాటికీ చెడిపోయే
ప్రసక్తేలేదని ప్రతిజ్ఞచేసి మరీ ప్రకటించమని పరమాత్మునిలో అంటున్నాడు ఆ సర్వేశ్వరుడు.
ఇప్పటివరకూ సాగిన ఈ విశ్లేషణా, వ్యాఖ్యానాలు పూర్తిగా హేతువు ఆధారంగా మరియు గీతాశాస్త్రం
వెలుగులో స్పష్టపరచబడ్డాయి. కనుక వీటిని నిర్లక్ష్యంచేసే లేక తిరస్కరించే అవకాశం ఏమాత్రం
లేదు. కాబట్టి 'సృష్టికర్త యొక్క సనాతన దృక్పథాన్ని' పునఃపరిశీలించ వలసిందిగా కోరుచున్నాము.
ఇంతవరకూ సాగిన ఈ పరిశీలన ఒక విషయాన్ని నిష్కర్షగా తెలిపేదేమిటంటే 'ఒక్క సర్వేశ్వరునికి
మాత్రమే అందరిలోకెల్లా అద్వితీయ స్థానం ఇచ్చి, ఆయనకు మాత్రమే హృదయకుహరంలో పరాకాష్ఠ
స్థానం కల్పించాలన్నది'. ఈ గీతాశాస్త్ర సందేశాన్ని తిరస్కరించి, తమకు నచ్చిన, తాము మెచ్చిన
ఏ విధానాన్ని అవలంబించినా అలాంటి వారి గతి ఏమవుతుందో కూడా ఈ గీతాశాస్త్రాన్నే అడుగుదాము.
యశ్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః స స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిమ్ -16:23
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని,
సుఖమునుగాని, ఉత్తమ గతియగు మోక్షమును గాని పొందనేరడు.

గీతాశాస్త్రం ప్రతిపాదిస్తున్న ఈ 'ఆలోచన- ఆచరణా' విధానాలను విడనాడి, స్వీయ ఆలోచన-ఆచరణ'లను
అనుసరించినట్లయితే 'ఇహంలో శాంతి పరంలో మోక్షము'ను కూడా పొందడం సాధ్యంకాదని గీతాశాస్త్రం
తీర్మానిస్తుంది. ఐదువేల సంవత్సరాలకు పూర్వం చేయబడిన ఈ తీర్మానమే నేటి ప్రపంచస్థాయి
సమాజంలో ప్రతిబింబిస్తూంది. నూటికి నూరుశాతం ఆర్థిక, విద్యా, వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధిని
సాధించిన సమాజాలలో సైతం ప్రజలు నిజమైన శాంతిని పొందలేక పోతున్నారు. పైగా ఆ
సమాజాలలోని ప్రజలలో ఎన్నెన్నో విపరీత పోకడలు కనిపిస్తున్నాయి. ఏదో తెలియని
ఆందోళనకు లోనై ఎంతోమంది ఆత్మహత్యలవంటి ఘోర అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
దీనికి మూలకారణం 'భగవంతునికి భక్తునికి' మధ్య ఉండవలసిన గీతాశాస్త్ర ప్రతిపాదిత
'సంబంధం' ఏర్పడక పోవటమే. మనశ్శాంతికి గీతా శాస్త్రం ప్రతి పాదిస్తున్న
ఈ 'ఐశ్వర్య దృక్పథం' (SCRIPTURAL CONCEPT OF GOD) ను అంగీకరిస్తే
మనశ్శాంతిని సాధించలేమంటారా? కచ్చితంగా సాధించవచ్చు.
సృష్టికర్తను గూర్చిన యథార్థ అవగాహనే 'ఆత్మసాక్షాత్కారం', ఈ ఆత్మ సాక్షాత్కారమే
'ఇహంలో మనఃశ్శాంతికి-పరంలో మోక్షానికి' ఏకైక మార్గం. 

No comments:

Post a Comment