మనం చూస్తున్న మతాలు అన్నీ ఆ సృష్టికర్త ఆదేశించినవేనా?
వీటిలో ఏదో ఒక మతాన్ని మనం అనుసరిస్తే ఆ దైవాన్ని చేరుకోగలమా?
మనం దేవుళ్ళు ఎంతమంది అని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఏ మతానికి చెందినవరైనా “దేవుడు ఒక్కడే” అనే సమాధానం ఇస్తారు. ఆ ఒక్క దేవుడే ఈ అనంత విశ్వానికి కర్త మరియు యజమాని. ఆయనే సమస్త ఉనికికి కారణమైన వాడు. కాబట్టి మానవులకు అనేక సృష్టికర్తలు (దేవుళ్ళు) లేరు!
అలాకాదని ఇండియాకు ఒక దేవుడు, జపాన్ కోసం వేరే దేవుడు, అమెరికాకు వేరే దేవుడు ఉన్నాడు అని అనటం అలాగే ఇండియాలో ఆంధ్రాకు ప్రత్యేక దేవుడు ఉన్నాడు, కేరళ కోసం వేరే దేవుడు, ఢిల్లీ వారి కోసం వేరే దేవుడు ఉన్నాడు అనటం విచిత్రమైన విషయం అవుతుంది. మరి అదేవిధముగా వర్షం కురిపించటానికి ఒక దైవం, జ్ఞానం ప్రసాదించటానికి మరొక్క దైవం, ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి వేరే దైవం ఉన్నారు అనటం కూడా విచిత్రమైన విషయమే.
మన బుద్ది – వివేచనాలను ప్రశ్నిస్తే అవే సమాధానమిస్తాయి అందరికీ సృష్టికర్త (దేవుడు) ఒక్కడే అని, కానీ ఆయనను వివిధ భాషల వారు వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఇలా ఆయనను పిలుచుకునే పేర్లు అనేకమైన దేవుడు మాత్రం అనేకం కాడు అనే విషయం అర్ధంచేసుకోవాలి.
ఆ ఒక్క దేవుడే మానవులను అనేక మతాల వారీగా విభజించాడు మరియు ఆయనే వివిధ మతాల వారికి పరస్పర విరుద్ధ విశ్వాసాలు ఇవ్వటం జరిగింది అనటం అసంభవమైన విషయాలు.
ఉదా:
ఆ దేవుడు ముస్లిములతో ‘నేను ఒక్కడినే’ అని చెప్పి మళ్ళీ హిందువులతో ‘నేను ఒక్కడిని కాదు, కోట్లలో ఉన్నాను’ అని చెప్పటం అలాగే క్రైస్తవులతో ‘నేను త్రిత్వాన్ని’ అని చెప్పటం అనేది అసంభవమైన విషయం.
ఆ దేవుడే ముస్లిములతో ‘నాకు ప్రతిమ లేదు’ అని చెప్పి హిందువులతో ‘నేను ఆకారిణి మరియు నిరాకారిణి కూడా’ అని చెప్పటం అలాగే క్రైస్తవులతో ‘నాకు రూపం ఉంది’ అని చెప్పటం అసంభవమైన విషయం.
ఇలా మనం లాజికల్ గా ఆలోచిస్తే ఆ ఒక్క దేవుడే మానవులను అనేక మతాలుగా విభజించాడు అన్నది అసంభవమైన విషయం అని అర్ధమౌతుంది.
వాస్తవమేమిటంటే ఆ ఒక్క దైవం తన ధర్మాన్ని అనేక కాలాలలో, అనేక భాషలలో, అనేక ప్రాంతాలలో, అనేక ఋషుల (ప్రవక్తల) ద్వారా ప్రజలవద్దకు పంపటం జరిగింది. వీరు మానవులే, వీరు దైవ ధర్మాన్ని ప్రజలకు తెలియచేసేవారు . వీరిలో మొదటి వారు ఆదమ్ (ఆయన పై దైవ శాంతి కలుగుగాక!) మరియు చివరి వారు ముహమ్మద్ (ఆయన పై దైవ శాంతి కలుగుగాక!). వీరి మధ్యలో నున్న సమస్త ఋషులు(ప్రవక్తలు) ఆ ఒక్క దేవుని ధర్మాన్నే ప్రజలకు చేరవేశారు. నేటికీ కూడా వారి బోధనలు గ్రంధాల రూపేణ మనముందున్నాయి.
దీనిని బట్టి మనకు అర్ధమౌతున్న విషయం ఏమిటంటే: ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు, అలాగే ఆయన నుండి ఋషుల ద్వారా మనకు అందించబడిన ధర్మం కూడా ఎల్లప్పుడు ఒకటే ఉన్నది. కానీ నేడు ప్రజలు ఆ ఒక దేవుని పేరు మీదే అనేక ధర్మాలు సృష్టించుకున్నారు. ఈ కల్పిత ధర్మాలలో ఏది దైవం నిర్దేశించిన ధర్మమో మరియు ఏది మానవులు కల్పించుకున్న ధర్మమో మనం తెలుసుకోవాలి.
కనుక రండి ఈ విషయాలపై అధ్యాయనం చేసి వాస్తవాలను తెలుసుకుందాం!
No comments:
Post a Comment