“జీవించటమే”.. ఆత్మహత్యకు అంతిమ పరిష్కారం..!

 





“జీవించటమే”.. ఆత్మహత్యకు అంతిమ పరిష్కారం /-


జీవితంలో ఏ సమస్యా రాకుండా ఎప్పటికీ సుఖంగా జీవించాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదురీదుతూ జీవితాన్ని సుఖమయం చేసుకోవటానికి ప్రయత్నించటం వివేకం అవుతుంది. అందుకే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదున్న ఇన్ని లక్షల జీవరాశుల్లో ఒక్క మనుషులకు మాత్రమే వివేకాన్ని ఇచ్చింది.
పరిష్కారం ఉన్న దానినే సమస్య అంటారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఎలా అన్నది లోతుగా ఆలోచించటం, స్నేహితులతో అనుభవం ఉన్నవారితో పంచుకోవటం లోనే సమస్యకు పరిష్కారం అన్నది దొరుకుతుంది.


కాకపోతే కొన్ని సార్లు పరిష్కారం లభించటానికి కాస్త ఆలస్యమవ్వొచ్చు. అంతమాత్రనా ఆత్మహత్య సమస్యకు పరిష్కారం ఎంతమాత్రం కాదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మస్థైర్యంతో నిలబడగలిగి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియని బేలతనంతో విపరీతమైన బెంగతో మానసిక ఒత్తిడి (Depression) కి గురై సున్నితత్వంతో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య చేసుకోవటం.

కాబట్టి మనిషి ఎంత బలమైన ఆత్మస్థైర్యంతో నిలబడగలుగుతాడో సమస్య అతని ముందు అంత చిన్నదైపోతుంది. ఎంత పిరికితనం ప్రదర్శిస్తాడో సమస్య అతని ముందు అంత పెద్దదైపోతుంది.
ఆత్మహత్య వల్ల ఏ సమస్య అయినా పరిష్కారమైతే అయిపోదు.. ఆ సమస్య వల్ల తలెత్తే ఒత్తిడి నుండి తప్పించుకోవటం అవుతుంది. సమస్య మటుకు అలానే మిగిలిపోతుంది. పోనీ ఆత్మహత్య చేసుకుని సమస్య నుండి తప్పించుకున్న తరువాత మిగతా జీవితం సుఖంగా గడపటానికి ఇక జీవితం ఉండదు కదా? అలాంటప్పుడు ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అనుకుని ఆత్మహత్యకు పాల్పడటం మూర్ఖత్వమే అవుతుంది.

అంతేకాదు చట్టం దృష్టిలో నేరం కూడా. ఐ.పి.సి. సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు పాల్పడి బ్రతికితే అతన్ని ఈ సెక్షన్ క్రింద హత్యానేరస్తునిగా కేసు పెడతారు. ఎందుకంటే ఎదుటివాడిని చంపటం ఎంతనేరమో తనను తాను చంపుకోవటం కూడా అంతే నేరమవుతుంది. కాబట్టి అసలు ఆత్మహత్యను బలవన్మరణం అనికూడా చెప్పకూడదు. అతను తన ఇచ్చతోనే తనను తాను చంపుకుంటాడు కాబట్టి ఇచ్చా మరణం అని చెప్పాలి. ఆత్మహత్యను ధార్మిక గ్రంథాలైతే మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాయి.
ఖురాన్- “మిమ్మల్ని మీరు చంపుకోకండి” అని చెబుతుంది. హిందూ శాస్త్రాలైతే ఆత్మహత్య తోటి వ్యక్తిని హత్య చేసినంత పాపమని చెబుతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ (స) అయితే “ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడతాడో ఉదాహరణకు కాల్చుకుని లేదా దూకి లేదా పొడుచుకుని తనను తాను చంపుకుంటాడో అచ్చం అలాంటి శిక్షే అతను పరలోకంలో శాశ్వతంగా వెయ్యబడుతూ ఉంటాడ”ని హెచ్చరించారు.
అంతేకాకుండా కొందరు తమకు తలెత్తే సమస్యలకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. అదైతే స్వయంగా తమ జీవితాలనే కాక పిల్లల భవిష్యత్తును కూడా తమ చేజేతులారా నాశనం చెయ్యటమే. ఈ మధ్యే నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఓ ఆటోడ్రైవర్ కుటుంబంతో సహా ట్రైనుక్రింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారకరమైన సంఘటన చూశాం.
ఈ మధ్య ఏ పేపరును తిరగేసినా ఇలాంటివి ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సెల్ఫీ వీడియోలు తీసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవటం ఓ ఫ్యాషనైపోయింది. ఎలాగూ ఆ క్షణం నుండి జీవితాన్ని అంతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినప్పుడు కాస్త బుద్ధి ఉపయోగించి తనకున్న సమస్య నుండి ఎలా బయటపడలా అని కొన్ని క్షణాలు ఆలోచించినా చాలు ఏదో పరిష్కారం దొరక్కపోదు. కేవలం మన వైఖరిలో వ్యత్యాసం చూపటమే. కాబట్టి ఊళ్లో నలుగురు ముందు తలెత్తి బ్రతకే సందర్భం లేనప్పుడు ప్రపంచం చాలా పెద్దది. చనిపోవాలనుకున్నంత వరకు వచ్చినప్పుడు అదేదో వేరేచోట ఏదో కాయాకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ “బ్రతకటం” మేలు కదా. ఆ ఊళ్లో ఆ వీధిలోనే పడి బ్రతకాలా లేదా చావాలా అన్న నిర్ణయం మూర్ఖత్వం అవుతుంది.

ఇక ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి వ్యవహారమైతే మరీ హాస్యాస్పదం. ఐస్ క్రీమ్ తిన్నంత సులువుగా సూసైడ్లు చేసుకుంటున్నారు. కొందరైతే అనుకున్న ర్యాంకు రాలేదని, వరకట్న వేధింపులకు, తీర్చలేని అప్పుల్లో మునిగిపోయి, ఆర్ధిక సంక్షోభాలకు గురై, ఆత్మీయులు లేరనో, ఎవరో వేధిస్తున్నారనో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే పరిష్కారం దొరికే సమస్యలే.
*****
మనిషి భౌతికంగా, శాస్త్రియంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందితే చాలు అతను నైతికంగా కూడా అభివృద్ధి చెందుతాడని భౌతికవాదులు, నాస్తిక అభ్యుదయవాదులు వాదిస్తూ ఉంటారు కానీ సమాజంలో చూస్తే పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఏ ఆర్ధిక సమస్యలు లేని సెలబ్రేటిల నుండి బాగా చదువుకున్న వారి వరకు అలవోకగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల నుండి పట్టణాలలో జీవించే వరకూ అనేక సమస్యల వలయాల్లో చిక్కుకుని మానసిక ఒత్తిళ్లకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నవారే అధికంగా ఉన్నారు.

“నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో” ప్రకారం భారతదేశంలో ప్రతీరోజూ 366 మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మందికి తెలీని విషయం WHO ప్రకారం ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యధిక మానసిక ఒత్తిడికి గురై ఉన్న వ్యక్తులున్న దేశం (World’s ‘most depressing country) గా గుర్తించింది. ప్రతీ గంటకూ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే సమాజ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వెయ్యగలం. పైగా ఈ గణాంకాలు భవిష్యత్తులో మరో పదింతలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిపట్ల అయ్యో, పాపం అని బాధపడటం కాదు వెతకాల్సింది సరైన పరిష్కారం. సంపూర్ణ వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసం ఎలా సాధ్యం? అన్నది ఆలోచించాలి. అటు భౌతికంగా శాస్త్రీయంగా, ఆర్ధికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ.. మనిషి తన అసలు జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోవటం కారణంగా తనకు ఎదురయ్యే సమస్యలకు బలహీనపడిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు.

ఇక్కడ గమనించాల్సింది స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే - “మేము మానవుణ్ణి శ్రమకోసం పుట్టించాము” – ఖురాన్ 90:4 అని చెబుతున్నాడు. దీనిని బట్టి కటిక బీదవాడి నుండి అపార కోటీశ్వరుడి వరకు మనిషన్న ప్రతీ ఒక్కడికీ “కష్టాలు, సమస్యలు, శ్రమ” అన్నవి కామన్.
ధార్మిక గ్రంథాలు ముఖ్యంగా చెబుతున్న విషయం- మనిషికి ఇవ్వబడిన భూలోక జీవితం ఇక్కడి కష్ట నష్టాలు, సుఖాలు సైతం కేవలం తాత్కాలికం మాత్రమే అసలు శాశ్వత జీవితం మరొకటి మరణాంతరం ప్రారంభమవుతుందని చెబుతున్నాయి. మనిషికి ఇవ్వబడిన ఆలోచనా సామర్థ్యం, మంచీ-చెడుల మధ్య విచక్షణ చేసే సామర్థ్యం.. మంచీ, చెడుల్లో వేటినైనా ఎంచుకునే స్వేచ్చా స్వతంత్రాలు అతనికి ఇవ్వబడినవి కేవలం పరీక్షార్థం మాత్రమే అని చెబుతున్నాయి.

అటు భౌతిక రంగంలో మనిషి ఎంత హేతుబద్ధంగా ఆలోచించగలుగుతాడో అంతేహేతుబద్ధంగా ఈ సృష్టిని పరిశీలించి దానిని ఎంతో క్రమబద్ధంగా నడుపుతున్న సృష్టికర్తను గుర్తించి ఆయనకే లోబడమని చెబుతున్నాయి. మతవ్యవస్థలో ఉన్న గుడ్డి నమ్మకాలను బట్టి ఎక్కడపడితే అక్కడ దేన్ని పడితే దాన్ని దైవాలుగా భావించవద్దని చెబుతున్నాయి.

నిజ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించటం వల్ల కలిగే రెండు లాభాలు ఒకటి మానసిక ప్రశాంతత లభిస్తుంది రెండు ఉన్నత నైతిక విలువలు పెరుగుతాయి. కాబట్టి ప్రతీ వ్యక్తీ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే..భౌతికజీవనంలో నిజ సృష్టికర్త అయిన దేవుని ఆదేశాలకు లోబడి జీవితం గడపాలి ఇదే మానవ జీవిత లక్ష్యం. తప్పితే మానవ జీవిత లక్ష్యం మిగతా జంతువుల్లా ఏదో కొన్నాళ్లు బ్రతికి తినీ, తాగి చనిపోవటం కాదు.

ఈ లోకంలో కష్ట నష్టాలు, భయప్రమాదాలన్నవి దరిద్రం కొద్దో, వాస్తు బాగోకో లేక ఎవడి వల్లో కలుగవు. అవన్నీ సృష్టికర్త అయిన దేవుని తరఫున తాత్కాలిక పరీక్షలు మాత్రమే. కష్టకాలాల్లోనూ మనిషి దైవంపై భరోసా పెట్టి మంచి మీదే నిలబడతాడా చెడు వైపుకు మ్రోగ్గుచూపుతాడా? అన్న పరీక్ష ప్రతీ వ్యక్తి జీవితంలోనూ సాగుతుంది. అటువంటి కష్ట కాలాల్లో ఎవరైతే ఇదంతా దేవుని తరఫున నాకు ఓ పరీక్షగా ఇవ్వబడిందని విశ్వసించి, మనస్థైర్యంతో దైవం పై భారం వేసి సహనం వహిస్తారో వారికి ఆ యా కష్టాల నుండి ఉపశమనం కూడా సృష్టికర్త అయిన దేవుడే కలిగిస్తాడని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి...
“భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఆదాయ, నష్టాలకు గురిచేసి మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము. అలాంటి సందర్భాలలో మనస్థైర్యంతో ఉండి దైవంపై భారం వేసిన వారికి కష్టాల నుండి గట్టెక్కే మార్గాన్ని కూడా ఆయనే చూపుతాడని" స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే చెప్పినట్టు ఖురాన్ లో చూడగలం. "సర్వవిధములుగా దైవానికి లోబడినప్పుడే సర్వోత్తమమైన శాంతి లభిస్తుంద"ని అటు గీతా శాస్త్రంలోనూ చదవగలం.

ఈ విధంగా మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి తన జీవిత విలువ ఏమిటన్నది తెలుసుకుంటాడు. అతనిలో మానసిక ఒత్తిడి తగ్గి “దృఢమైన మానసిక సామర్థ్యం” ఏర్పడుతుంది. వ్యక్తుల్లో సంపూర్ణ వ్యక్తిత్వ మానసిక వికాసం అన్నవి సాధ్యమవుతాయి.

No comments:

Post a Comment