శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున, కృష్ణుని జనానికి సంబంధించిన కథ గురించి తెలుసుకోండి.
కృష్ణుడి జన్మస్థలం
భౌగోళికంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర అనే నగరంలో ఆయన పుట్టారు. ఆ కాలంలో యాదవుల కులానికి ఉగ్రసేనుడు అనే ప్రముఖ నాయకుడు ఉండేవాడు. ఉగ్రసేనుడికి వయసు పైబడుతూ ఉంటుంది, అత్యాశతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకునే ఆయన కుమారుడైన కంసుడికి తండ్రి చనిపోయేవరకు ఆగే ఓపిక కూడా లేదు. సొంత తండ్రిని చెరసాలలో పెట్టించి నాయకుడౌతాడు. అలాగే ఈశాన్యం దిక్కున ఉండే జరాసంధుడు అనే పరమ క్రూరుడైన చక్రవర్తితో పొత్తు పెట్టుకుంటాడు. తెలిసిన ప్రపంచాన్నంతటినీ జయించాలి అనేది జరాసంధుని కల. పరమ క్రూరమైన సైనిక బలంతో జరాసంధుని అధికారం చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శక్తిమంతునిగా కావడానికి అదొక్కటే మార్గం కావడంతో, కంసుడు అతనితో పొత్తు పెట్టుకుంటాడు.
కృష్ణుని చంపాలని కంసుడు ఎందుకు అనుకున్నాడు?
కంసుడి చెల్లెలు దేవకి, వాసుదేవుడు అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతను ఇంకో యాదవ నాయకుడు. పెళ్లి జరిగిన తరువాత, కంసుడు తన రథంలో ఈ కొత్త జంటని తీసుకెళ్తుండగా, ఆకాశం నుండి ఆకాశవాణి, ”ఓ కంసా, నీ చెల్లెలి పెళ్లి తర్వాత ఎంతో సంతోషంతో నువ్వు ఆమెను తీసుకువెళుతున్నావు, ఈ చెల్లెలకి పుట్టే ఎనిమిదవ సంతానం నిన్ను చంపుతాడు. అదే నీ అంతం” అని చెబుతుంది.
వెంటనే కంసుడు కోపోద్రిక్తుడౌతాడు. “ఓఁ, ఆమె ఎనిమిదవ కుమారుడు వచ్చి నన్ను చంపుతాడా? నేను ఆమెని ఇప్పుడే చంపేస్తాను, ఆమెకు ఎనిమిదవ కుమారుడు ఎలా పుడతాడో చూద్దాం” అంటాడు. తన కత్తితో, అక్కడికక్కడే సొంత చెల్లెలి తలని నరికేయాలి అనుకుంటాడు. పెళ్లి కొడుకు అయిన వాసుదేవుడు, కంసుడితో ప్రాధేయపడతాడు, “దయచేసి ఆమెను బతుకనివ్వు, ఇంత ఘోరం ఎలా చేయగలవు? ఆమె నీ చెల్లలు, పైగా మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాము, ఇక్కడికిక్కడే ఆమెను ఎలా నరకుతావు?” అంటాడు. అందుకు కంసుడు, “ఆమె ఎనిమిదవ కుమారుడు నన్ను చంపుతాడు, అటువంటిదేదీ నేను జరగనివ్వను” అంటాడు. అప్పుడు వాసుదేవుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు, “పుట్టగానే మా బిడ్డల్ని నీకు అప్పజెప్తాము, నువ్వు వాళ్ళని చంపుకోవచ్చు, కానీ దయచేసి ప్రస్తుతానికి నా భార్యని వదిలేయి” అంటాడు.
కానీ తన ప్రాణం, దాని భద్రత గురించి మరీ అతిగా గాభరా పడుతున్న కంసుడు, తన చెల్లెల్ని ఇంకా బావను ఎప్పుడూ గమనించగలిగేలా గృహ నిర్బంధంలో ఉంచుతాడు. మొదటి బిడ్డ పుట్టగానే, ఆ కాపలాదారులు కంసుడికి తెలియజేస్తారు. అతను వచ్చినప్పుడు, దేవకీ వాసుదేవులు ఏడుస్తూ, “నిన్ను చంపేది ఎనిమిదవ బిడ్డ కదా, దయచేసి ఈ బిడ్డని వదిలేయి” అంటూ అతన్ని బ్రతిమాలతారు. అందుకు కంసుడు, “నేను ఏ అవకాశమూ తీసుకోదల్చుకోలేదు” అంటాడు. ఆ బిడ్డ కాళ్ళు పట్టుకుని పైకి ఎత్తి, బండకేసి బాదుతాడు. బిడ్డ పుట్టిన ప్రతిసారీ ఇలానే కొనసాగుతుంది. వాళ్లు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడతారు, కానీ అతను ఒక్క బిడ్డను కూడా విడిచి పెట్టడు. పుట్టిన ఆరుగురు బిడ్డలను ఈ విధంగా చంపుతాడు.
బలరాముడు గోకులానికి ఎలా చేరతాడు
దేవకీ వాసుదేవులు ఈ కంసుడు చేసే పనులు చూసి విసిగిపోతారు. ఆ రాజ్యంలోని ప్రజలు కంసుడు అంటే ఎంతో భయపడిపోతూ ఉండేవారు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడటం, పిల్లల్ని ఇలా చంపటం చూసి, కాలక్రమేణా, వాళ్లు కూడా ఆ రాజు చేసే ఇలాంటి అకృత్యాలతో విసిగిపోతారు. మెల్లగా రాజాంత:పురంలోనే తిరుగుబాటు మొదలౌతుంది. అందువల్ల ఏడో బిడ్డ పుట్టినప్పుడు, వాసుదేవుడు ఆ బిడ్డని రహస్యంగా కోట నుండి బయటకి పంపించి, మరెక్కడో అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకువచ్చి తన బిడ్డ స్థానంలో ఉంచగలుగుతాడు. తన బిడ్డని వసుదేవుడు యమునా నది దాటించి గోకులానికి చేర్చి, తన మరొక భార్య అయిన రోహిణికి అప్పజెప్తారు
ఈ బిడ్డడి పేరు బలరాముడు. అతను పెద్ద ఆజానుబాహుడిగా ఎదుగుతాడు. అలాగే, అతని బలం గురించి ఇంకా అతను చేసిన సాహసాల గురించి ఎన్నో కధలు కూడా ఉన్నాయి.
వాసుదేవుడు కృష్ణుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళడం
ఎనిమిదవ బిడ్డ పుట్టబోతున్నాడు అనగానే, కంసుడిలో నిజంగానే కంగారు మొదలవుతుంది. ఇన్ని రోజులుగా వాళ్ళు గృహ నిర్భంధంలో ఉన్నారు, కానీ ఇక ఇప్పుడు అతను వాసుదేవుడికి సంకెళ్ళు వేయించి, దేవకిని చరసాలలో బంధిస్తాడు. వారికి పౌర్ణమి తరువాత బహుళ పక్షంలో 8 వ రోజున బిడ్డడు పుడతాడు, ఆ రాత్రి ఒకటే కుండపోత వర్షం ఇంకా ఉరుములు. ఏదన్నా అవుతుందేమోనని కంసుడు ఎవ్వరినీ ఆ చరసాలలోకి వెళ్ళనిచ్చేవాడు కాదు. అతను తనకి బంధువయిన పూతన అనే నమ్మకస్తురాలుని, మంత్రసానిగా నియమిస్తాడు. వారి ప్రణాళిక ఏమిటంటే, బాగా గమనిస్తూ, బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను కంసుడికి అప్పజెబితే, కంసుడు ఆ బిడ్డను చంపుతాడు..
పురిటి నెప్పులు వస్తాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. పూతన చాలా సేపు వేచి ఉంటుంది. అయినా ప్రసవం జరగదు. ఇంటికెళ్ళి వద్దాము అనుకుని, రాత్రి సమయంలో బయటకి వెళ్తుంది. కానీ ఆమె ఇంటికి వెళ్లేసరికి, ఉన్నట్టుంది భారీ వర్షం పడుతుంది, వీధులన్నీ వరద నీటితో నిండిపోతాయి. ఇక ఈ పరిస్థితిలో పూతన తిరిగి చెరసాలకి వెళ్ళలేకపోతుంది.
సరిగ్గా అప్పుడే ఒక బిడ్డ పుడతాడు. ఇంకా మరో అద్భుతం జరుగుతుంది. ఆ చెరసాల తలుపులు వాటికవే తెరుచుకుంటాయి, కాపలాదారులు అందరూ మత్తు నిద్రలోకి జారుకుంటారు. సంకెళ్ళు తెగి పోతాయి. వెంటనే వాసుదేవుడు బిడ్డ పుట్టుకలో ఏదో దైవ సంకల్పం ఉందని అర్థం చేసుకుంటాడు. అతను ఆ బిడ్డను తీసుకుని, ఏం చేయాలో సహజంగానే తెలిసినట్టుగా, యమునా నదిలోకి నడుచుకుంటూ వెళతాడు. ఆ ప్రదేశం అంతా వరద నీటితో పొంగిపొర్లుతున్నా, ఆశ్చర్యంగా నది ఇవతల నుండి అవతల వరకు రేవు మాత్రం చక్కగా, సునాయాసంగా నడవగలిగేలా ఉంటుంది. దాని పై నుండి నడుస్తూ, నదిని దాటి యశోదా నందుల ఇంటికి వెళతాడు. యశోద సరిగ్గా అప్పుడే ఒక ఆడ బిడ్డకు జన్మనిస్తుంది. ఆమెకు విపరీతమైన పురిటి నొప్పుల వల్ల, స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. వాసుదేవుడు ఆ ఆడబిడ్డని, కృష్ణుణ్ణి మార్చేస్తాడు. ఆ ఆడబిడ్డని తీసుకొని చెరసాలకి తిరిగి వస్తాడు
యశోద కూతురికి ఏమవుతుంది?
అప్పుడు ఆడబిడ్డ ఏడుస్తుంది. కాపలాదారులు విని, వెళ్లి విషయాన్ని కంసుడికి చెబుతారు. అప్పటికి పూతన తిరిగి వస్తుంది. కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డని చూస్తాడు. అతడికి అక్కడ ఎదో జరిగిందన్న అనుమానం వచ్చి పూతనని, “ఇది నిజమేనా? బిడ్డ పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా?” అని అడుగుతాడు. పూతన ప్రాణ భయంతో, “నేను ఉన్నాను, స్వయంగా నా కళ్ళతో చూశాను” అని చెబుతుంది. మరింత నమ్మిక కలిగించడం కోసం, “ఈ బిడ్డ సరిగ్గా ఇక్కడే, నా కళ్ళ ముందే పుట్టింది” అని చెబుతుంది. దేవకీ వసుదేవులు, “ఇది ఒక ఆడబిడ్డ. ఈ పిల్ల నిన్ను చంపలేదు. పుట్టింది మగపిల్లవాడు అయివుంటే, అతను నిన్ను చంపేవాడేమో. కానీ పుట్టింది ఆడబిడ్డ. దయచేసి ఈమెను వదిలిపెట్టు” అంటారు. కానీ కంసుడు, “లేదు. నేను ఎటువంటి అవకాశం తీసుకోదలుచుకోలేదు” అంటాడు. అతను బిడ్డ కాళ్ళు పట్టుకుని, పైకి లేపి, నేల మీదకి విసరాలనుకుంటాడు. అతను అలా చేయబోతూ ఉండగా, ఆ బిడ్డ చేతుల్లో నుంచి జారి, కిటికీల గుండా బయటకు వెళ్లి, కంసుని వంక చూసి, నవ్వుతూ, “నిన్ను చంపేవాడు మరొకచోట ఉన్నాడు” అంటుంది.
ఇప్పుడిక కంసుడికి నిజంగా అనుమానం వస్తుంది. అతను అక్కడ ఉన్నవాళ్ళందరినీ విచారిస్తాడు. కాపలా దారులు నిద్రపోయారు. పూతన బయటికి వెళ్ళింది. ఎవరూ ఏమీ ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. ‘‘ఇలా చేయకపోతే నువ్వు చస్తావు” – అంటూ మీరు బెదిరించి పనులు చేయాలనుకుంటే, మొదట్లో అది మీకు ప్రయోజనకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కావలసినవి మీరు కోరుకున్నట్లుగా జరుగుతాయి. కానీ కొంత కాలం తర్వాత, అది పెద్ద సమస్య అవుతుంది. ఏదైనా మీరు కోరుకున్న విధంగా జరగకపోతే, వాళ్ల ప్రాణాలు పోతాయని వాళ్లకి తెలుసు. కాబట్టి వాళ్ళు మీ చుట్టూ, అంతా బాగానే ఉంది అన్నట్టు ఒక కల్పిత వాతావరణాన్ని సృష్టిస్తారు. మీరు భయపెట్టి పనులు చేయిస్తే, మీరు ఎదుర్కోవాల్సిన పర్యవసానం ఇదే.
ఇదిలా ఉండగా, కృష్ణుడు గోకులంలో, నాయకుడి కొడుకు అయినప్పటికీ, అతను ఒక సాధారణ గోవుల కాపరిగా పెరుగుతాడు. ఆయన జీవితంలో, ఆయన చుట్టూ ఎన్నో అద్భుతాలూ, సాహాసాలు జరుగుతాయి.
No comments:
Post a Comment